HYDRA Ranganath Visits Bathukamma Kunta : ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా తన పంథాను మార్చింది. అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండానే జలవనరుల్ని పునరుద్దరించేందుకి రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ప్రజల్లో నెలకొన్న అపోహలు దూరం చేసేందుకు హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటకి పూర్వవైభవం తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. స్వయంగా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మకుంటను సందర్శించి కూల్చివేతలు ఉండవని భరోసా ఇవ్వడంతో పాటు రెండునెలల్లో బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం తీసుకువస్తామని స్పష్టం చేశారు.
రూటు మార్చిన హైడ్రా : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతతో సంచలనంగా మారిన హైడ్రా కొత్తదారిని ఎంచుకుంది. చెరువులు, కుంటల ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు చేయకుండానే పునర్జీవం కల్పించేందుకు కార్యాచరణ సిద్దంచేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను సందర్శించారు. ఆ కుంట ఆక్రమణలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై తరచూ ఫిర్యాదులు రావడంతో స్పందించిన రంగనాథ్ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు.
రెండు జేసీబీలతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బతుకమ్మకుంటను చదును చేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బతుకమ్మకుంటను ఆనుకొని జీవిస్తున్న వీకర్స్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన ఆయన ప్రజల ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. కోర్టు వివాదంలో ఉన్న బతుకమ్మ కుంటపై న్యాయనిపుణుల బృందం పోరాటం చేస్తోందని తెలిపారు. సుమారు రెండున్నర కోట్లతో పునరుద్దరణ పనులు చేపట్టి రెండు నెలల్లోనే బతుకమ్మ కుంటకు పూర్వవైభవం తీసుకొస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
హైడ్రా కమిషనర్ రాకతో స్థానికుల హర్షం : 1962-63 లెక్కల ప్రకారం సర్వే నెంబర్ 563లో బతుకమ్మకుంట బఫర్‌జోన్‌తో కలిపి మొత్తం 16.13ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. తాజా సర్వే ప్రకారం 10 ఎకరాలకు పైగా స్థలం కబ్జాకి గురికావడంతో ప్రస్తుతం 5.15 ఎకరాలకే పరిమితమైందని అధికారులు తేల్చారు. చెత్తాచెదారం, భవన నిర్మాణ వ్యర్థాలతో నింపడం వల్ల బతుకమ్మకుంట కుంచించుకుపోయి ఆనవాళ్లు కోల్పోయింది.
ముళ్ల చెట్లతో చుట్టు పక్కల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వర్షం పడితే వరద నీరు చెరువులోకి వెళ్లే మార్గంలేక బస్తీలన్ని జలమయంగా మారుతున్నాయి. దోమలు, పాముల బెడద ఎక్కువడంతో బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా కమిషనర్ రాకతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు బతుకమ్మకుంటను త్వరగా పునరుద్దరణ చేయాలని హైడ్రా చేసే పనికి ఆటంకం కలిగించబోమని చెబుతున్నారు.
అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకుడు : బతుకమ్మకుంట భూమిపై స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ప్రభుత్వభూమి కాదని, తనదేనని తెలిపారు. కోర్టు వివాదంలో ఉండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మకుంటలోకి బుల్డోజర్లను ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఒత్తిడితో బతుకమ్మకుంట స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని ఎడ్ల సుధాకర్ రెడ్డి తెలిపారు.
హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై నోటీసుల పరంపర కొనసాగుతుందని స్పష్టంచేశారు. హైడ్రా అంటే కూల్చివేతలే కాదని, పునరుద్దరణ చేస్తుందని ప్రజలు గుర్తించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
మళ్లీ రంగంలోకి హైడ్రా బుల్డోజర్లు - ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణం కూల్చివేత
వాటిపై ఫోకస్ పెట్టిన హైడ్రా - ప్రత్యేక టీమ్‌తో బెంగళూరుకు కమిషనర్ రంగనాథ్