దేశంలో అల్లర్లు చెలరేగేలా ప్రజలను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందన్న ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. ప్రధాని బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు హస్తం పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ. దేశ ప్రజల సమస్యలపై మాట్లాడటం కాంగ్రెస్ హక్కు అని ఉద్ఘాటించారు. ఈ విషయాలపై స్పందించడం కాంగ్రెస్ బాధ్యతని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ కూడా హింసాత్మక నిరసనలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
'మీ వల్లే ఈ పరిస్థితి'
ఎన్ఆర్సీ(జాతీయ పౌర పట్టిక)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పార్లమెంట్లో అమిత్ షా ప్రకటించినందునే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఆనంద్ శర్మ. ఎన్ఆర్సీ, పౌరసత్వం చట్ట సవరణపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు.
పౌరసత్వ సవరణపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించి.. పౌర నిరసనలకు స్వస్తి చెప్పే విధంగా ప్రధాని మాట్లాడాలని అన్నారు. ఈ అంశాన్ని సున్నితంగా, తీవ్రంగా భావిస్తే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి చర్చించాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రధాని మాత్రమే దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దగలరంటూ వ్యాఖ్యానించారు.
నిర్బంధ కేంద్రాలపై..
భారత్లో నిర్బంధ కేంద్రాలు లేవన్న మోదీ వ్యాఖ్యలపై ఆనంద్ శర్మ స్పందించారు. దేశంలో నిర్బంధ కేంద్రాలు ఉన్న విషయం అంతర్జాతీయ మీడియా సైతం ధ్రువీకరించిందని తెలిపారు ఆనంద్. ప్రజలనే కాక కార్గిల్ యుద్ధంలో దేశం తరపున పోరాడినవారిని సైతం అందులో ఉంచారని ఆరోపించారు. అసోంలో ఐదు గదుల్లో 600 మందిని నిర్బంధించిన విషయాల గురించి అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: 'పౌరచట్టం, ఎన్ఆర్సీలతో ఎవరికీ ఎలాంటి నష్టం లేదు'