నిద్ర సరిపోకపోవడం, రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టకపోవడం, పగలు మత్తుగా అనిపించడం.. ఏదో తెలియని ఆందోళన ఇవన్నీ నిద్రలేమి (ఇన్‌సోమ్నియా) సమస్య కిందకే వస్తాయి. పేరు ఏదైనా... ఈ తరహా ఇబ్బందిని మనం కేవలం నిద్రలేమికి సంబంధించిన సమస్యగా భావించి, ఆ రాత్రి ఎలా గడపాలి... ఎలా నిద్రపోవాలి అని ఆలోచించి శతవిధాలా ప్రయత్నిస్తాం. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట వేరు. ఇన్‌సోమ్నియా అనేది వ్యాధి కాదట. జ్వరం, నొప్పిలా మరో సమస్య వల్ల పైకి కనిపించే లక్షణం మాత్రమేనట.
సమస్య తెలిస్తే..
అసలు సమస్య ఏంటో, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఇన్‌సోమ్నియాను సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సాధారణంగా ఇన్‌సోమ్నియా రావడానికి 50 శాతం వరకూ.. మానసిక సమస్యలే కారణం. ఒత్తిడి బాధించినప్పుడు, ఆందోళన వేధించినప్పుడు నిద్ర గాలికి ఎగిరిపోయి సాధారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. మొదట కొన్ని రోజులు నిద్రలేమి బాధిస్తుంది. దాంతో సహజంగా మనలో ఉండే జీవగడియారంలో మార్పులు సంభవించి క్రమంగా రాత్రిళ్లు నిద్రపట్టడం తగ్గిపోతుంది.
ఆ సమస్య నుంచి తాత్కాలికంగా బయపడేందుకు ఏదో వ్యాయామాలు చేయడం, కాఫీలు తాగడం, ఎక్కువ సేపు మంచంపై ఉండి అటూ ఇటూ దొర్లడం వంటివి చేస్తారు. దీంతో పరిస్థితి ఇంకా దిగజారుతుందే కానీ ఏమాత్రం మెరుగుపడదు. అలా కాకుండా ఎంత సేపు నిద్రపోతారో అంత సేపే నిద్రపొండి. తెల్లారి ఏడింటికి నడకకు వెళ్లాలనుకుంటే వెళ్లిపొండి. రాత్రి మీరు ఒంటిగంటకు పడుకున్నా సరే మీరు ఏడింటికి నడకకు వెళ్లడం అనేది తప్పనిసరి. మీరు ముందే పడుకున్నా ఈ టైంటేబుల్‌ని మాత్రం మిస్‌కావొద్దు. ఇలా మీ దినసరిని ఒక పద్ధతిలోకి తీసుకొస్తే కొన్ని రోజులకు మీ నిద్రా సమయం అదుపులోకి వస్తుంది. మంచి నిద్రతో ఒత్తిడి కారణంగా వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతాయి.
ఇదీ చూడండి: మీకు ఎక్కువకాలం బతకాలని ఉందా?