చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కశ్మీర్‌పై చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ గురించి చైనాకు బాగా తెలుసునని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం సరికాదని హెచ్చరించింది.
కశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు.
"కశ్మీర్‌పై ఇమ్రాన్‌ఖాన్-జిన్‌పింగ్ చర్చించిన విషయాలను మేము పరిశీలించాం. జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. చైనాకు భారత్ గురించి తెలుసు. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలు వ్యాఖ్యానించడం సరికాదు." - రవీశ్‌కుమార్, భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
పాక్.. చీనీ కుయుక్తులు
ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను చైనా నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఇరుదేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడాన్ని వ్యతిరేకిస్తున్న పాక్.. చైనా సాయం కోసం అర్రులు చాస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా చైనా తనదైన రాజకీయం చేస్తోంది.
మోదీతో భేటీకి ముందు..
ప్రధాని నరేంద్ర మోదీతో రెండో అనధికార సమావేశం కోసం జిన్‌పింగ్ ఆక్టోబర్ 11న భారత్‌కు రానున్నారు. ఇలాంటి కీలక సమయంలో పాక్ ప్రధానితో భేటీ అయిన పింగ్.. పాక్-చైనా స్నేహం దృఢమైనది, విడదీయరానిదని వ్యాఖ్యానించడం, కశ్మీర్‌పై అనవసర ప్రసంగం చేయడం గమనార్హం.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌కు భారతీయత తెలియదు- వారిది ఇటలీ సంస్కృతి'