దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, సామాజిక సాంస్కృతిక కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రజారోగ్య నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య శాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ వెల్లడించారు.
విద్యార్థులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించిన అగర్వాల్.. అంతర్జాల విద్యను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని తెలిపారు. ఈయూ, ఐరోపా, టర్కీ, యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ నెల 18 నుంచి నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
కర్ణాటకలో మరో కేసు..
దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కర్ణాటకలో తాజాగా మరొకరికి కొవిడ్-19 సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 8కి చేరింది.
కేరళలో కొత్తగా ముగ్గురు..
కేరళలో మరో ముగ్గురికి వైరస్ సోకినట్లు తెలిపిన ముఖ్యమంత్రి పినరయి విజయన్... రాష్ట్రంలో మొత్తం 24 కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,450 మంది వైద్య పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు.
నగరం నిర్బంధంలో ఉండదు...
మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి నగరాన్ని పూర్తిగా నిర్బంధించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కానీ నగరంలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర పర్యటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రముఖ పర్యటక ప్రాంతాలైన అజంతా ఎల్లోరా గుహలు, ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయం, ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవాని ఆలయం, మంత్రాలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు .
మ్యూజియాల మూసివేత...
దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ మ్యూజియాలను, జాతీయ పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న అన్ని స్మారక కట్టడాల సందర్శనలను మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు.
ఇదీ చూడండి:ఇరాన్లో 853కు చేరుకున్న కరోనా మరణాలు