బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్మిళా మాతోంద్కర్ ఇటీవలే శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. అది నటి కంగనా రనౌత్‌తో వివాదం వల్ల తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు ఊర్మిళ. తనకు కంగనతో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని తేల్చిచెప్పారు. కంగన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. మహారాష్ట్ర, మరాఠీ ప్రజలు, ముంబయి పోలీసులకు అపఖ్యాతి తెచ్చాయని ఈటీవీ భారత్ ముఖాముఖిలో అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ.. రాజకీయాలకు దూరంగా లేనని తెలిపారు ఊర్మిళ. తన తండ్రి జాతీయ సేవా దళంలో పనిచేసేవారని, దాంతో తనకు చిన్న తనం నుంచే సామాజిక సేవ అలవడినట్లు చెప్పారు. " ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో చిన్నతనంలోనే అవగాహన ఉంది. కొంత మందితో విభేదాల కారణంగానే కాంగ్రెస్ పార్టీని వీడా. కొద్ది నెలల క్రితం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. సాహిత్యం, కళారంగంలో తమ పార్టీకి బలం అవసరమని.. శాసనమండలికి రావాలని పిలిచారు. అప్పుడే ఠాక్రేకు ఓకే చెప్పాను" అని తెలిపారు.
మహిళా సమస్యలపై పోరాటం..
శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత మహిళల ఆరోగ్యం, విద్య వంటి ఇతర సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు ఊర్మిళ. శివసేన మరాఠీ మానసపుత్రికగా పేరుగాంచిందని, పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించారని చెప్పారు. పార్టీలోని మహిళా కార్యకర్తలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెల్లి వారి హక్కులు, న్యాయం కోసం పోరాటం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి విపత్తు సమయంలో శివసేన సైనికులు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ధారావి వంటి ప్రాంతాలకు వెళ్లారని గుర్తుచేశారు ఊర్మిళ.
ఇదీ చూడండి: కంగనపై శివసేన 'అస్త్రం' ఊర్మిళ!