దేశంలో కొన్ని వారాల్లో కొవిడ్ నిరోధక టీకా అందుబాటులోకి వస్తుందనే అంచనాల మధ్య వ్యాక్సిన్ శాస్త్రీయ సమర్థత, ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రశ్నే లేదని కేంద్రం స్పష్టం చేసింది. క్లినికల్స్ ట్రయల్స్‌లో భద్రత, శాస్త్రీయ నిబంధనల మేరకే..తాము టీకాకు అనుమతిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ స్పష్టంచేశారు. ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన దక్షిణాసియా దేశాల మంత్రుల సమావేశంలో ఈ మేరకు వర్దన్ వెల్లడించారు.
మిషన్ ఇంధ్రధనుష్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భారత్ మరింత డిజిటల్ అనుసంధానత విస్తరింపజేయడంపై మంత్రి వివరించారు. కొవిన్ డిజిటల్ వేదికను రూపొందించి పౌరులే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించారు. అలా నమోదు చేసుకున్నవారికి క్యూర్ కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. డీసీజీఐ అనుమతి ఇచ్చిన వెంటనే దేశంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.