బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెగ్రా, అలౌలిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆర్జేడీ నేత తేజస్వీనే లక్ష్యంగా.. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆల్ఫాబెట్స్ రాని వాళ్లు ఉద్యోగాల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అంటూ తేజస్వీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 9వ తరగతి వరకే చదివిన తేజస్వీ యాదవ్.. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చిరాగ్‌పై మౌనం
మరోవైపు దివంగత నేత రాంవిలాస్ పాసవాన్ సొంత నియోజకవర్గమైన అలౌలిలో పర్యటించిన నితీశ్ ఎల్జేపీని గానీ, ఆ పార్టీ అధినేత చిరాగ్‌ను గానీ ఒక్క మాట కూడా అనలేదు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత నితీశ్‌నే లక్ష్యంగా చేసుకుని చిరాగ్ బహిరంగ వేదికలపైనా, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నా నితీశ్.. చిరాగ్ గురించి మాట్లాడకపోవడం గమనార్హం. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి మంత్రం జపించారే తప్ప ఎల్జేపీపై విమర్శల జోలికి పోలేదు.
ఈ స్థానం(అలౌలి) నుంచే రాంవిలాస్ పాసవాన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన ఇటీవలే మరణించిన నేపథ్యంలో విమర్శలు చేయడం మంచిదికాదన్న అభిప్రాయానికి వచ్చి ఈవిధంగా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.