దేశాన్ని నివ్వెరపరిచిన నిర్భయ ఘటనలో దోషుల మెడకు ఉరి బిగిసింది. దేశరాజధానిలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన మృగాళ్లు ఏడేళ్ల తర్వాత శుక్రవారం ఉరికంబం ఎక్కారు. మరణశిక్ష నుంచి తప్పించుకోవటానికి వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరికి ఉరికొయ్యలకు వేలాడారు.
ఏడేళ్ల పాటు తిహార్ జైలులోనే ఉన్నారు ఈ నలుగురు దోషులు. ఈ కాలంలో జైలు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరిపై అధికారులు చాలా సార్లు చర్యలు తీసుకున్నారు. నలుగురిలో వినయ్ ఎక్కువసార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
నిబంధనలు పాటించని కారణంగా 11 సార్లు వినయ్‌పై చర్యలు తీసుకున్నారు అధికారులు. పవన్ 8, ముకేశ్ 3, అక్షయ్ ఒకసారి నిబంధనలు ఉల్లంఘించారని జైలు వర్గాలు తెలిపాయి. తప్పుల తీవ్రత ప్రకారం కుటుంబాన్ని కలిసే అవకాశం కల్పించకపోవటం, బారక్ మార్చటం వంటి శిక్షలు విధించారు.
చదువు...
2015లో వినయ్ ఏడాది వ్యవధి ఉండే డిగ్రీ కోర్సు తీసుకున్నాడు. అయితే అది పూర్తి చేయలేదు. ఏడాది తర్వాత ముకేశ్, పవన్, అక్షయ్ పదో తరగతిలో చేరారు. పరీక్షలు హాజరైనా ఉత్తీర్ణులు కాలేకపోయారని జైలు అధికారులు తెలిపారు.
సంపాదన..
జైలు జీవితంలో రోజువారీ కూలీ చేసి.. వినయ్ రూ.39వేలు అర్జించాడు. పవన్ రూ.29వేలు, అక్షయ్ రూ.69వేలు సంపాదించారు. ముకేశ్ మాత్రం జైలులో కూలీ పని చేయనని తేల్చిచెప్పాడు.
చివరి కోరికలు..
ఉరి తీసే ముందు దోషులను తమ చివరి కోరికలు అడగడం తప్పనిసరి. నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్.. తన అవయవాలను దానం చేయడానికి సిద్ధపడ్డాడు. తన పెయింటింగ్స్‌ను జైలు సూపరిండెంట్‌కు, తన వద్ద ఉన్న హనుమాన్ చాలీసాను తన కుటుంబానికి అందజేయాలని మరో దోషి వినయ్ కోరాడు. అయితే నలుగురిలో ఒక్కరు కూడా వీలునామా రాయలేదు.
ఇదీ చదవండి: నిర్భయ భారతం - మృగాళ్లకు గుణపాఠం