ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్.. దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన మానసిక స్థితి సరిగా లేదని, తలకూ గాయాలయ్యాయని.. అందుకే మెరుగైన వైద్యం అందించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.
వినయ్ మానసిక పరిస్థితి బాలేదని.. తల్లిని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనలను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖండించారు. ఇవేవీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
ఈ పూర్తి వ్యవహారంపై స్పందించాలంటూ తిహార్ జైలు అధికారులకు నోటీసులను జారీ చేసింది దిల్లీ కోర్టు. శనివారం నాడు తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.
ఉరి పరిస్థితి..?
ఈ నెల 16న జైలులో వినయ్ ఆత్మహత్యకు యత్నించినట్టు తిహార్ జైలు ఓ ప్రకటన విడుదల చేసింది. జైలులోని గోడలకు తన తలను బలంగా కొట్టుకుని.. తన అంతట తానే గాయపరుచుకున్నాడని స్పష్టం చేసింది.
రెండు వాయిదాల అనంతరం మార్చి 3న నలుగురు దోషుల ఉరికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉరి నుంచి తప్పించుకోవడానికి దోషులు అన్ని మార్గాలు వెతుక్కుంటున్నారు.
ఇదీ చూడండి:- డెత్ వారెంట్ల జారీపై సుప్రీం కోర్టు అసంతృప్తి