తమ కుటుంబ సభ్యులతో చివరిసారి కలిసేందుకు నిర్భయ దోషులకు వీలు కల్పిస్తూ తిహార్ జైలు అధికారులు లేఖలు రాశారు. మార్చి 3న ఉరి తీయాలని ఇటీవల దిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టారు.
మొత్తం నలుగురు దోషుల్లో ముఖేష్, పవన్ ఫిబ్రవరి 1న డెత్ వారెంట్‌కు ముందే కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఇప్పుడు మిగిలిన ఇద్దరు దోషులు అక్షయ్, వినయ్ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు కలవాలనుకుంటున్నారో అడిగినట్లు తిహార్ జైలు అధికారి తెలిపారు.
చివరి సారిగా!
సాధారణంగా ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కేవలం కిటికీల ద్వారా కలుస్తారు. కానీ ఉరిశిక్ష పడిన దోషులు... తమ కుటుంబ సభ్యులను చివరిసారి చూసేటప్పుడు వారితో ముఖాముఖి కలవడానికి అనుమతిస్తారు.
రెండు రోజుల ముందే!
తిహార్ జైలు అధికారులు... ఉత్తరప్రదేశ్ జైలు అధికారులకు ఓ లేఖ రాశారు. నిర్భయ దోషులకు ఉరి అమలు చేసేందుకు మార్చి 3కి రెండు రోజుల ముందే ఉరితీసే వ్యక్తిని పంపించాలని కోరారు.
కట్టుదిట్టం
ఫిబ్రవరి 16న దోషుల్లో ఒకడైన వినయ్ తన గదిలోని గోడకు తలతో బాదుకున్నాడు. దీనితో జైలు అధికారులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం వినయ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దారుణం
2012 డిసెంబర్ 16 అర్థరాత్రి సమయంలో కదిలే బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై దోషులు సమూహికంగా హత్యాచారం చేశారు. బాధితురాలు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ న్యాయపోరాటంతో వారికి మరణశిక్షలు పడ్డాయి. పటియాలా హౌస్ కోర్టు సోమవారం నలుగురు దోషులకు తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఆగ్రాలో ట్రంప్ చేతికి 600 గ్రాముల వెండి తాళం- ఎందుకంటే...