నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరి శిక్ష ఖాయమైంది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని దిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
ఉరిశిక్షను వాయిదా వేయాలని దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది దిల్లీ కోర్టు. ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో కొత్తగా డెత్ వారెంట్లు జారీ చేయాలని తిహార్ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
జైలు అధికారుల పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది.
జనవరి 7న దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ కేసులోని నలుగురు దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని ఉరిని వాయిదా వేయాలని ముకేశ్ కోరాడు.
కేసు వివరాలు...
2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.
- ఇదీ చూడండి: మహాత్మునికి భారతరత్న కోరిన పిటిషన్ తిరస్కరణ