సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ దోషులు పవన్, అక్షయ్ వేసిన పిటిషన్‌ను దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పవన్ మినహా ఇప్పటికే తమకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు నిర్భయ దోషులు.
క్షమాభిక్షకు అభ్యర్థన పెట్టుకున్న పవన్ గుప్తా..
ఉరి అమలుకు ఒక్క రోజు ముందు నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. దీనికి ముందు పవన్ క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో అతడు తనకున్న చిట్టచివరి అవకాశమైన క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ దిల్లీ పాటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. ఈ అంశంపై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది.
మరోవైపు నిర్భయ దోషులను కోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం ఉరితీసేందుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శతవిధాలా ప్రయత్నాలు..
ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా.. దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు నలుగురు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించారు. దీనికి కోర్టు అంగీకరించడంతో ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది.
ఆ తర్వాత దోషులకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల దిల్లీ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశించింది. ఉరి అమలు దగ్గరపడుతున్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మరోసారి కోర్టుకు వెళ్లాడు. తన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గించాలని కోరుతూ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. తాజాగా క్షమాభిక్ష పెట్టుకున్నాడు.