నిర్భయ అత్యాచారం, హత్య కేసులో క్షమాభిక్ష పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లతో ఉరిశిక్ష అమలు పలుమార్లు వాయిదా పడేలా చేసిన దోషులు.. తన ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నారు. శిక్ష అమలును తప్పించుకునేందుకు న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకున్న దోషులు.. తాజాగా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.
సుప్రీం కోర్టుకు ముకేశ్..
నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్.. తనకు ఉన్న న్యాయపరమైన అన్ని అవకాశాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో తన న్యాయవాది తనను తప్పుదారి పట్టించారని ఆరోపించాడు. రివ్యూ పిటిషన్‌లను తిరస్కరించిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్‌లను దాఖలు చేసేందుకు మూడేళ్ల వరకు గడువు ఉంటుందని తెలిపిన ముకేశ్.. అందువల్ల 2021 జులై వరకు అందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు.
కుట్ర చేశారని ఆరోపణ..
ముకేశ్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించిన వినోద్ గ్రోవర్ కుట్ర చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. సెషన్స్ కోర్టు ఆదేశించిందని భయపడి ముకేశ్‌ను వేర్వేరు పత్రాలపై సంతకం చేసేలా బలవంత పెట్టారని వివరించారు. సెషన్స్ కోర్టు అలా ఆదేశించలేదని ముకేశ్ ఇటీవలే తెలుసుకున్నాడని తెలిపారు.
ఇదీ చూడండి: ఆఫీసులు, స్కూళ్లు, యూనివర్సిటీల్లో ఇక అవి బంద్!