నిఫా... అరుదైన, తీవ్ర ప్రాణాంతకమైన వైరస్... గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్ సోకుతుంది. 1999లో మలేసియాలో మొదటిసారిగా ఈ వైరస్‌ను కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఆ తర్వాత 2001లో బంగ్లాదేశ్‌లో గుర్తించినట్లు ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా కేరళలో గతేడాది 17 మంది మృతి చెందారు.
ఎలా సంక్రమిస్తుంది..?
నిఫా వైరస్ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్ సోకిన జంతువు లేదా మనిషిని ప్రత్యక్షంగా తాకడం వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్ సోకుతుంది. ఫ్రూట్ బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వ్యాధి వ్యాప్తికి తొలి వాహకాలు.
లక్షణాలు ఇవే...
నిఫా వైరస్ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు 14 రోజుల్లో బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్లు అనిపించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదమూ ఉంది.
టీకా లేదు! ...నివారణ చర్యలే
నిఫా వైరస్‌కి చికిత్స లేదు. దీనిని నియంత్రించే టీకాలు ఇంత వరకు కనుగొనలేదని వైద్యులు తెలిపారు. వైరస్ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిలాలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించారు. వీటితో పాటు ఈ క్రింది నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
⦁ వైరస్ సోకిన పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
⦁ పండ్లు, కూరగాయలను శుభ్రపరిచిన తర్వాతే తినాలి.
⦁ తినేముందు ప్రతిసారీ చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
⦁ గబ్బిలాలు మామిడి పండ్లు, జాక్ ఫ్రూట్స్, రోజ్ ఆపిల్స్‌లను ఆహారంగా తీసుకుంటాయి. వీటిని తినే ముందు తగు జాగ్రత్తలు పాటించాలి.
ఇదీ చూడండి : భూటాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి జయ్శంకర్