గతేడాది సంచలనం సృష్టించిన రాజస్థాన్ కోటాలో శిశు మరణాల వార్త మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా కొన్ని గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది పసికందులు మృతి చెందారు. వారిలో ఒకరోజు నుంచి నాలుగు రోజుల వయసున్న ఐదుగురు శిశువులు బుధవారం రాత్రి, మరో నలుగురు గురువారం జేకే లోన్ ఆసుపత్రిలో మరణించినట్లు ఓ అధికారి తెలిపారు. ముగ్గురు సాధారణంగా మరణించగా.. మరో ముగ్గురు పుట్టుకతోనే వచ్చే వ్యాధుల వల్ల మృతి చెందారని.. మరో ముగ్గురు రిఫర్డ్ కేసులని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
వైద్యుల నిర్లక్ష్యమే పిల్లల మరణానికి కారణమని వ్యాధుల వల్ల చనిపోయిన శిశువుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘు శర్మ.. ఆసుపత్రి వర్గాల నుంచి నివేదిక కోరారు. ఈ అంశాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశు మరణాల జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు శర్మ పేర్కొన్నారు.
గతేడాదిలో..
గతేడాదిలో 100మంది పిల్లల మరణవార్త అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 48 గంటల వ్యవధిలోనే 10 మంది పిల్లలు మృతి చెందడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి ఆసుపత్రి వర్గాలు.
ఇదీ చూడండి: 'రైతుల వెనక ఎవరున్నారో మీరే కనిపెట్టాలి'