రైతులు చేపట్టిన 'ట్రాక్టర్ ర్యాలీ'లో దిల్లీలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఎర్రకోట హింసాత్మక ఘటనలకు ప్రధాన బాధ్యులుగా భావిస్తున్న పంజాబ్ గాయకుడు దీప్ సిద్ధు, దీప్ దీపు అనే మరో వ్యక్తికి మంగళవారం సాయంత్రమే ఎన్ఐఏ నోటీసు పంపినట్లు సమాచారం. ఆందోళనకారులు ఎర్రకోట వైపు వెళ్లేలా వీరు ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. ఎర్రకోట భద్రత, ఐటీ చట్టాల కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అనుమానితులపై నిఘా..
దీప్ సిద్ధుతో పాటు మరికొందరిపైనా ఎన్ఐఏ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళనల్లో చాలామంది అనుమానితులు ఉన్నాయని, తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
దేశ రాజధాని దిల్లీలో మంగళవారం హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో.. భద్రత బలగాలను భారీగా మోహరించారు. దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న సింఘు, టిక్రీ ప్రాంతాల్లోనూ భద్రత పెంచారు. ఎర్రకోటను భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.