ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారన్న కేసులో జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్) అధినేత యాసిన్ మాలిక్‌కు ఉచ్చు బిగిస్తోంది ఎన్ఐఏ. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్‌పై దిల్లీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ.
ఆసియా ఆండ్రాబీ, షాబీర్ షా, మసారత్ ఆలం భట్ వేర్పాటువాదులతో పాటు జమ్ముకశ్మీర్ మాజీ శాసనసభ్యుడు రషీద్ ఇంజినీర్‌ను కూడా అభియోగ పత్రంలో నిందితులుగా చేర్చింది ఎన్ఐఏ. ఈ కేసుపై న్యాయస్థానం ఈనెల 23న విచారణ జరపనుంది. విచారణ ప్రక్రియను కెమెరా ద్వారా చిత్రీకరించనున్నారు.
కస్టడీ పొడిగింపు
ఉగ్రవాదుల ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్‌ను ఇవాళ దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్ఐఏ అధికారులు. ఆ తర్వాత ఇదే కేసుకు సంబంధించి మాలిక్ జుడీషియల్ కస్టడీని ఈ నెల 23వరకు పెంచుతూ.. తీర్పునిచ్చింది కోర్టు. అభియోగ పత్రంలో పేర్కొన్న వేర్పాటువాదులందరికీ 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధాలపై తాజాగా ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.
భారత దౌత్యవేత్త హత్య కేసులోనూ..
జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండితుల హత్యల్లోనూ వీరిపాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండితులు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్ఎఫ్కు సంబంధాలు ఉన్నాయి.