ఉత్తర్‌ప్రదేశ్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. పోలీసుల తీరుతో.. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఫిర్యాదుల మేరకు యూపీ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నిరసనలు, పోలీసులు తీసుకున్న చర్యలపై పూర్తి స్థాయి నివేదికను 4 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది.
"ఈ నిరసనలకు సంబంధించి ఇతర ఫిర్యాదులు కూడా అందాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. డిసెంబర్ 23వ తేదీన అందిన ఫిర్యాదు మేరకు ఉత్తర్‌ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది."
-సీనియర్ అధికారి,ఎన్హెచ్ఆర్సీ.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు అదుపు చేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం పలు సందర్భాల్లో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారులు. పోలీసుల దాడుల్లో పలువురు యువత మరణించారని, అంతర్జాల సేవలను నిలిపివేశారని తెలిపారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టినా.. పోలీసులే ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారలుపై ఆరోపణలు చేశారని ఫిర్యాదులో విన్నవించారు.
ఇదీ చూడండి : మరోసారి పాక్ దుర్నీతి.. భారత సైన్యాధికారి వీరమరణం