కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించి దేశంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా మున్ముందు జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలుచోట్ల ఉప ఎన్నికల నిర్వహణకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా భయం వెంటాడుతున్న వేళ నామినేషన్ దాఖలు, ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర సమయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచిస్తూ గతంలో ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
కీలక మార్గదర్శకాలివే..
పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలపై ఓటు వేసేందుకు ఓటర్లందరికీ చేతి గ్లౌజులు ఇవ్వాలి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్‌లోనే సమర్పించి ఆ తర్వాత ప్రింట్ కాపీని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నామినేషన్ సమయంలో డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. ఇలా చేయడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించుకోవచ్చు. ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో పాటు ఐదుగురు మించొద్దు.
కరోనా రోగులకు చివరి గంటలో అవకాశం!
పోలింగ్ కేంద్రం వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశ/ నిష్క్రమణ ప్రదేశాల్లో శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి. కరోనా లక్షణాలు ఉన్నవారికి చివరి గంటలో ఓటు వేసేందుకు వీలుగా టోకెన్లు జారీ చేయాలి. భౌతికదూరం పాటించేందుకు వీలుగా గుర్తులు ఏర్పాటు చేయాలి. బీఎల్‌వోలు, వాలంటీర్లు భౌతికదూరం నిబంధనలు సరిగా జరిగేలా చూడాలి. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాస్క్, శానిటైజర్, ఫేస్ షీల్డ్, గ్లౌజ్‌లు సమకూర్చాలి.
ఓట్ల లెక్కింపు ఇలా..
ఓట్లు లెక్కించేటప్పుడు ఒక హాల్‌లో ఏడు టేబుళ్ల కంటే ఎక్కువ అనుమతించరు. ప్రతి నియోజకవర్గంలో మూడు నాలుగు హాళ్లు ఏర్పాటు చేసి అదనపు సహాయ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారు. వీవీప్యాట్‌లను లెక్కింపునకు ముందు శానిటైజ్ చేయాలి. లెక్కింపు కేంద్రాలను కూడా లెక్కింపునకు ముందు, తర్వాత శానిటైజ్ చేయాలని ఈసీ ఆదేశించింది.
ఇదీ చదవండి: ఇది చూశారా! డ్రోన్ ద్వారా ప్రజలకు సరకులు