కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత పి.చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని చిదంబరం తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్... జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే... ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ రమణ ధర్మాసనం స్పష్టంచేసింది.
చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. మొత్తం రూ.305కోట్ల అవినీతి జరిగిందని 2017 మే 15న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ.
ఆగస్టు 21న చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. న్యాయస్థానం ఆయనకు అక్టోబరు 3వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టు, దిల్లీ హైకోర్టులో ప్రయత్నించినా ఫలితం లేకపోగా... సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిదంబరం.
ఇదీ చూడండి:దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు