మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ను వివాదాస్పద వ్యాఖ్యల భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఓ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుకున పడ్డ కమల్‌నాథ్‌కు.. ఆ రాష్ట్ర భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాను తాను శునకంగా సంబోధించినట్లు వచ్చిన ఆరోపణలు అసహనానికి గురిచేశాయి. దీంతో వాటిపై ఆయన స్పందిస్తూ సింధియా విషయంలో తాను ఆ పదాన్నే ఉపయోగించలేదని ఆదివారం గ్వాలియర్‌లో మీడియాతో అన్నారు. "అశోక్‌నగర్ సభలో నేను సింధియాను శునకంగా సంబోధించానని ఆయన ఆరోపించారు. ఏవిధంగానూ నేను సింధియాను ఆ పేరుతో పిలవలేదు. దానికి అశోక్‌నగర్ ప్రజలే సాక్ష్యం" అని కమల్‌నాథ్ వెల్లడించారు.
భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా శనివారం ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ కమల్‌నాథ్ తనను శునకంగా సంబోధించారని ఆరోపణలు చేశారు. "అవును కమల్‌నాథ్‌జీ.. నేను శునకాన్నే.. ఎందుకంటే ప్రజలే నాకు యజమానులు. వారిని (ప్రజల్ని) కాపాడాల్సిన బాధ్యత నాదే. కాబట్టి నేను శునకాన్నే" అంటూ సింధియా అన్నారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ వెంటనే స్పందిస్తూ.. కమల్‌నాథ్ అశోక్‌నగర్ సభలో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఏ పరిస్థితిలోనూ ఆయన ఆ పదాన్ని ఉపయోగించలేదని సింధియా తరపు ప్రతినిధి నరేంద్ర సలూజా తెలిపారు.
కాగా ఇటీవల కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా మహిళా మంత్రి ఇమర్తి దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో భాజపా సహా కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో స్టార్ ప్రచారకర్తగా ఆయనను తొలగించాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఆయన ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.