వరుసగా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ముందుకెళుతోంది సరిహద్దు దేశం నేపాల్. భారత భూభాగాన్ని కలుపుతూ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు చట్టం చేసిన కొద్ది రోజుల అనంతరమే మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్ జిల్లా దర్చులా వద్ద.. కాళి నది పక్కనున్న మాల్పా ప్రాంతంలో హెలీప్యాడ్ నిర్మించింది. భారత్- నేపాల్ సరిహద్దు వద్ద ఓ క్యాంప్ ఏర్పాటు చేసింది. కాలాపానీకి 40 కి.మీ దూరంలో హెలికాఫ్టర్ ద్వారా వందల సంఖ్యలో తమ సైన్యాన్ని నేపాల్ భారత భూభాగంలోకి పంపిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అక్కడ సైనికుల కోసం తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దర్చులా నుంచి తింకర్ వరకు కొత్తగా రహదారి నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే భారత సరిహద్దులో తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.
రహదారి ఇందుకే
ఎత్తైన హిమాలయ ప్రాంతాలకు వలస వచ్చే నేపాలీలు.. ఇందుకోసం భారత సరిహద్దులోని దర్చులా రహదారినే వినియోగిస్తున్నారు. వీరు భారత రహదారిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకే ఓ రహదారిని నిర్మిస్తోంది నేపాల్.
జాతీయ చిహ్నంలో..
2019 నవంబర్‌లో భారత్ కొత్త పటాన్ని ప్రచురించిన ఆరునెలల అనంతరం.. వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతాలను తమవని పేర్కొంటూ గతనెలలో నూతన రాజకీయ చిత్రపటాన్ని విడుదల చేసింది నేపాల్. జూన్ 18న కొత్త రాజకీయ చిత్రపటాన్ని జాతీయ చిహ్నంలో చేర్చే రాజ్యాంగ సవరణకు నేపాల్ ఎగువ సభ ఆమోదం తెలిపింది.
ఆమోదయోగ్యం కానీ విస్తరణ
భారత భూభాగాలైన లిపులేక్, కాలాపానీ, లింపియదురలను నేపాల్ రాజకీయ చిత్రపటంలో చూపేందుకు ఆ దేశం చేసిన చట్ట సవరణపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్రం. అంగీకార యోగ్యం కాని కృత్రిమ విస్తరణ అని పేర్కొంది.
ఇదీ చూడండి: లష్కరేతో సంబంధమున్న నలుగురు అరెస్టు