తమ అజెండాలను అంగీకరించిన వారికే మద్దతిస్తామని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా తెలిపారు. హరియాణా ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం తొలిసారి మీడియా సమావేశం నిర్వహించిన దుష్యంత్... రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. భాజపా, కాంగ్రెస్‌లలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అగ్రపార్టీలతో చర్చలు జరపలేదని వెల్లడించారు.
"హరియాణాను ముందుకు నడిపించడానికి మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలోని యువతకు వారి హక్కులను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేరాలను నియంత్రించడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. మా 'కామన్ మినిమల్ ప్రోగ్రామ్'కు సహకరించి.. మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నవారికి మేము మద్దతిస్తాం. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదు. చర్చలు జరిపిన తర్వాత... కొద్ది గంటల్లోనైనా, కొద్ది రోజుల్లోనైనా మీకు స్పష్టతనిస్తాము."
--- దుష్యంత్ చౌతాలా, జేజేపీ నేత
హరియాణా ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లల్లో గెలుపొందింది. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికే అవకాశం ఉన్న తరుణంలో జేజేపీ నేత దుష్యంత్ కింగ్‌మేకర్‌గా ఆవిర్భవించారు.
అయితే 40 స్థానాలను ఖాతాలో వేసుకున్న భాజపా మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో నిలిచింది. శుక్రవారం ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్ కాండా మద్దతు కూడగట్టుకుని తన బలాన్ని 48కి పెంచుకుని.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది భాజపా.