మెరుగైన భవిష్యత్తు కోసం ప్రస్తుతం కొన్ని కష్టాలు భరించాల్సిందేనని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన పలు ట్వీట్‌లు చేశారు.
"కరోనాపై పోరు ఎంత కాలమనేది మన చేతుల్లోనే ఉంది. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు భరించాలి. లాక్‌డౌన్ 2.0 ఆశించిన ఫలితాలు రావాలంటే అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది."
- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్
ఉత్తమమైన నిర్ణయం..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయమే ఉత్తమమైనదని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా దుర్బలమైన వర్గాల జీవనోపాధి గురించి ప్రధాని జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. వారితో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా అవసరమైన చర్యలను ప్రధాని తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుత పరీక్ష సమయంలో మనం చేసే పోరాటం ఆధారంగానే లాక్‌డౌన్ ఎత్తివేత ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ 1.0లో సాధించిన ఫలితాన్ని కాపాడుకోవాలంటే లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రజలకు సూచించారు.