ఈనాటి యువ జనాభాను సహస్రాబ్ది తరం (మిలీనియల్స్) అంటున్నారు. 1981-1996 నడుమ జన్మించి, 2000 సంవత్సరం నుంచి- అంటే కొత్త సహస్రాబ్ది తొలి దశకాల్లోనే వృత్తిఉద్యోగాల్లో ప్రవేశిస్తారు కాబట్టి వారికి ఆ పేరు వచ్చింది. ప్రపంచ యువ జనాభాలో 86 శాతం మిలీనియల్స్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తుంటే, వారిలో 100 కోట్లమంది ఒక్క ఆసియాలోనే ఉన్నారు. 2025కల్లా ప్రపంచవ్యాప్తంగా పనిచేసేవారిలో 75 శాతం మిలీనియల్సే అవుతారు. 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా మిలీనియల్స్ వార్షిక ఆదాయం 15 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. భారతదేశంలో ఈ ఏడాదికే మిలీనియల్స్ జనాభా 41 కోట్లకు చేరింది. ఈ సహస్రాబ్ది తరం మునుపటి తరాలకన్నా ఉన్నత విద్యావంతులు. వీరు స్మార్ట్‌ఫోన్ల సాయంతో వస్తువుల కొనుగోళ్ళకు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి వినోద సేవలకు, ఉబర్, ఓలా, స్విగీ వంటి సేవలకు చేసే ఖర్చు నానాటికీ పెరుగుతోంది. మిలీనియల్స్ ఆసక్తులు, అభిరుచులు ఆర్థికంగా అపార ప్రభావాన్ని ప్రసరిస్తున్నాయి. భారత్‌లో ఆటోమొబైల్ రంగ మందగతికి మిలీనియల్స్ మనస్తత్వమూ ఒక కారణమని సాక్షాత్తు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం గమనార్హం. రుణాల మీద కార్లు కొని నెలనెలా కిస్తీలు కట్టేకన్నా ఉబర్, ఓలా వాహనాల్లో, మెట్రో రైళ్లలో తిరగడం మేలని వారు భావిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేవరకు ఆగుదామని యువతరం భావించడం వల్ల కూడా పెట్రోలు, డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుతున్నాయి.
కౌశలం ఉంటేనా కాసులు
50 శాతం మిలీనియల్స్ స్మార్ట్ ఫోన్లలో ఉద్యోగాల కోసం అన్వేషించడం చూస్తే ఉద్యోగ వేట తీరుతెన్నులూ మారిపోతున్నాయని తేలుతోంది. అంతేకాదు, రోజూ రవాణా రద్దీలో ఇరుక్కునేకన్నా ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో పనిచేయడానికి మిలీనియల్స్ ఇష్టపడుతున్నారు. ఐటీ విప్లవం వల్ల కంపెనీలూ దీన్ని నెమ్మదిగా ప్రోత్సహిస్తున్నాయి. పని వేళలను మార్చుకునే సౌలభ్యాన్నీ ఇస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే 43 శాతం ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని ఒక సర్వే తెలిపింది. అదే సమయంలో తమకు ఇష్టమైన ఉద్యోగాలను, వేతనాలను పొందగలమనే నమ్మకం మిలీనియల్స్‌లో ఉండటం లేదనీ స్వయంగా రిజర్వు బ్యాంకు అధ్యయనం తెలిపింది. అందుకే భారత్‌లో సంభవిస్తున్నది- ఉపాధి రహిత అభివృద్ధి అని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మిలీనియల్స్ ఉద్యోగాన్వేషణ కన్నా సొంత వ్యాపారాలు పెట్టుకోవడం మేలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారి ఆకాంక్షలకు దన్నుగా ముద్ర రుణాలు, స్టార్టప్ ఇండియా వంటి పథకాలతో ముందుకొచ్చింది. వారు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి కావలసిన నైపుణ్యాలను అందించడానికి స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రకటించింది. కానీ, ఈ పథకాలు ఆచరణలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.
నైపుణ్యాలు సమకూర్చుకోవాలి
ఏదిఏమైనా ఆధునిక నైపుణ్యాలను సంతరించుకున్నవారు మాత్రమే రేపటి ప్రపంచంలో ఆర్జనపరులుగా నిలదొక్కుకోగలుగుతారు. యువజన దినోత్సవ నినాదం ప్రకారం దేశాభివృద్ధికి వారిని చోదక శక్తులుగా మలచాలంటే భారతీయ సమాజం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. ఈ ఏడాది మనం జరుపుకొనే జాతీయ యువజన దినోత్సవ నినాదమిదే. స్వామీ వివేకానంద జన్మదినమైన జనవరి 12వ తేదీని ప్రతి ఏటా యువజన దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారతదేశాన్ని 2025కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే, యువజనుల శక్తియుక్తులను సమర్థంగా వినియోగించుకోవాలి.
టెక్నాలజీలో ఎక్కడ?
ఈ క్రమంలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఛత్రం కింద యువ శాస్త్రజ్ఞుల కోసం ఇటీవల అయిదు ప్రయోగశాలలను ప్రారంభించారు. అవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబయిలలో పనిచేస్తున్నాయి. సహస్రాబ్ది తరం నుంచి నవీకరణ సాధకులను తయారుచేసుకోవలసిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. డీఆర్డీఓ యువ ప్రయోగశాలలు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, కాగ్నిటివ్ సాంకేతికతలు, స్మార్ట్ మెటీరియల్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను దేశ రక్షణ కోసం అభివృద్ధి చేస్తాయి. యువజనులంటే కేవలం పనిచేసే హస్తాలు, నవ్య మేధానిధులు మాత్రమే కాదు- వారు రేపటి నాయకులు కూడా. ప్రపంచం అంతకంతకూ స్వయంచాలితం, సాంకేతిక చోదితమవుతూ, వేగంగా మారిపోతోంది. ఆ వేగాన్ని అందుకునే సత్తా యువజనుల సొంతం కాబట్టి రేపు నాయక పాత్రను సమర్థంగా పోషించడానికి కావలసిన అర్హతలను ఇప్పటి నుంచే సంతరించుకుంటున్నారు. కృత్రిమ మేధ, రోబొటిక్స్, స్వయంచాలనం (ఆటోమేషన్) వల్ల వృత్తిఉపాధులు సమూలంగా మారిపోతున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను తాజాపరచుకోవడానికి, కొత్త నైపుణ్యాలను అలవరచుకోవడానికి సహస్రాబ్దితరం కృషి చేయకతప్పదు. అందుకు అవసరమైన వసతులను అమర్చడం తమ బాధ్యత అని ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, విద్యా వ్యవస్థలు గుర్తించి కార్యోన్ముఖం కావాలి. మిలీనియల్స్ కూడా చొరవగా రేపటి ప్రపంచంలో రాణించడానికి తగు నైపుణ్యాలను అలవరచుకోవాలి. కాలంతోపాటు తామూ మారుతూ సమయస్ఫూర్తితో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఉదాహరణకు ఆటోమేషన్, ఏఐ వల్ల ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గడంతో ఇంజినీరింగ్, సైన్స్ పట్టభద్రులు డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్తదారులు వెతుక్కుంటున్నారు. సిబ్బంది అంతా ఒకే కార్యాలయంలో లేక కార్ఖానాలో కలిసి పనిచేసే రోజులు పోతున్నాయి. మేనేజర్ ఒకచోట ఉండి, వేర్వేరు ప్రాంతాల్లోని సిబ్బందితో పనిచేయించే రోజులు వచ్చేశాయి. సామాజిక మాధ్యమాల్లో, స్మార్ట్ ఫోన్లలో మాటామంతీ జరపడంలో ఆరితేరిన సహస్రాబ్ది తరం, ఈ తరహా రిమోట్ నిర్వహణలో సులువుగా ఇమిడిపోగలుగుతుంది.
సవాళ్లు స్వీకరించాలి!
మన విద్యావ్యవస్థ కూడా రేపటి అవకాశాల గురించి యువతలో అవగాహన పాదుగొల్పి, వాటిని అందిపుచ్చుకోవాలన్న పట్టుదలను పెంపొందించాలి. దేశాభివృద్ధికి వారు తమ శక్తియుక్తులను వెచ్చించే వాతావరణాన్ని సృష్టించాలి. జాతీయ యువజన దినోత్సవం వంటి కార్యక్రమాల పరమార్థమిదే. ఇటువంటి దినోత్సవాలు కేవలం గంభీర, ఉత్తేజకర ప్రసంగాలకే పరిమితం కారాదు. సహస్రాబ్దితరం ఆశలు, ఆశయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను గుర్తించి, వాటిని అధిగమించడానికి ఆచరణీయ ప్రణాళికలను చేపట్టడం ప్రభుత్వ విధి. కార్పొరేట్ రంగం కూడా యువ సిబ్బంది ఉద్యోగంలో, జీవితంలో విజేతలుగా ఎదగడానికి తోడ్పడే నిర్వహణ విధానాలను అనుసరించాలి. 21వ శతాబ్దంలో విజయ సాధన అంత తేలిక కాదని యువతరం అనుభవంలో తెలిసివస్తోంది. నేడు జీవితంలో రాణించాలంటే ఐఐటీ, ఐఐఎంల వంటి ఉత్కృష్ట విద్యా సంస్థల్లో పట్టభద్రులవక తప్పదనే భావన నెలకొంది. అటువంటి సంస్థల్లో ప్రవేశాల కోసం పోటీ ఉద్ధృతమవుతోంది. యువతరంపై తల్లిదండ్రుల ఒత్తిడీ పెరుగుతోంది.
చదువుల తీరు మారాలి
విద్య వ్యాపారమయమైపోయిందని విమర్శలు వస్తున్నాయి. యువత నిరంతరం నేర్చుకోవాలనే తపనతో దూసుకెళ్లాలి కానీ, ఒత్తిడితో కుంగిపోకూడదు. రేపటి కృత్రిమ మేధ యుగంలో భారత్ తరహా బట్టీ చదువులకు స్థానం ఉండదు. అలాంటి చదువులతో చేసే ఆనవాయితీ పనులను మనుషులకన్నా యంత్రాలే అత్యంత సమర్థంగా చేయగలుగుతాయి. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సృజనశీల విద్య చోదకశక్తి కానుంది. ఆ విప్లవంలో అగ్రగాములుగా ఎదగాలంటే అభ్యాస, ఆచరణలను అత్యుత్తమంగా మేళవించాలి. అటువంటి ఉత్తమ గుణ సమ్మేళనం జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాల విద్యావిధానాల్లో కనిపిస్తోంది. వాటి నుంచి భారత దేశం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆధునిక ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్యే ప్రధాన సాధనం. మొక్కుబడి చదువులు, బట్టీయం చదువులకు మున్ముందు స్థానం ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి విద్యార్థులు చొరవ, సృజనశీలతలను ఇనుమడింపజేసుకోవాలి. వారికి కావలసిన ప్రాతిపదికను తల్లిదండ్రులు, గురువులు, ఏలినవారు ఏర్పరచాలి. ఆ పని చేసినప్పుడు మాత్రమే యువతరం భారత సామాజిక, ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలబడగలుగుతుంది!
డిజిటల్ యుగంలో కొత్త అవకాశాలు
ప్రస్తుత యువతరం స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలతో కాలలం వృథా చేస్తోందనే భావన సర్వత్రా నెలకొని ఉంది. అది కొంతవరకే నిజం. ఈ డిజిటల్ సాధనాలు వినోదంతోపాటు విజ్ఞానానికీ పట్టుగొమ్మలని మరచిపోకూడదు. డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, సామాజిక మాధ్యమాలు వ్యాపారపరంగా లబ్ధి చేకూర్చిపెట్టగలవు. వీటిలో ఆరితేరిన యువత సహజంగానే కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించుకోగలుగుతుంది. ఇతర దేశాల్లో సంభవిస్తున్న పరిణామాలు, కొంగొత్త ధోరణులను అంతర్జాలం ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొంటోంది. ఆన్‌లైన్ కోర్సులతో నైపుణ్యాలకు పదును పెట్టుకొంటుంది. విదేశాల్లో విద్యావ్యాపార అవకాశాలను అందుకోగలుగుతుంది.
- కైజర్ అడపా (రచయిత)
ఇదీ చూడండి: 'మహిళా ఆర్మీ పోలీసుల శిక్షణ 6న ప్రారంభం'