సార్వత్రిక ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. 2014తో పోలిస్తే అదనంగా మరో 55 స్థానాల్లో గెలుస్తామన్నారు. ఇంతటి నమ్మకానికి కారణం జాతీయ భద్రత విషయంలో తమ ప్రభుత్వ పనితీరు, ప్రధాని నరేంద్రమోదీపై ప్రజల విశ్వాసమేనని స్పష్టం చేశారు అమిత్ షా.
పీటీఐ వార్తాసంస్థతో ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలపై స్పందించారు అమిత్ షా. కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.
"రాజీవ్ గాంధీపై ఆరోపణలు చేస్తుంటే మోదీని దూషిస్తున్నారు రాహుల్, ప్రియాంక. నేను అడిగేది ఒకటే. భోఫోర్స్ సమయంలో ప్రధానిగా ఉన్నది రాజీవ్ గాంధీ కాదా? భోపాల్ గ్యాస్ ఘటనలో నిందితుడు పారిపోయింది వారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? వీటిపై ఎందుకు చర్చ జరగకూడదు? మీరు ఎంత ప్రయత్నించినా గతం నుంచి తప్పించుకుపోలేరు. మే 23న మోదీ బట్టలు సర్దుకోవాల్సిందేనని అన్నారు. ఆ రోజు రానివ్వండి.. ఎవరు సర్దుకుంటారో చూద్దాం."
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
మోదీ పాలనలోనే క్షేమంగా ఉంటామని ప్రజలు భావిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదంపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలే అందుకు ఉదాహరణ అని తెలిపారు.
"2014 తర్వాత మెరుపు దాడులు, వైమానిక దాడులతో ప్రజలు క్షేమంగా ఉంటామని భావిస్తున్నారు. గర్వపడుతున్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి దృఢమైన మద్దతు ఇస్తున్నారు. అయితే భద్రత, జాతీయవాదం గెలుపు ఓటముల సమస్య కాదు. కానీ గెలుపుపై పూర్తి నమ్మకముంది."
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
ఎన్డీఏలో ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు అమిత్ షా.
"కేసీఆర్, నవీన్ పట్నాయక్ వంటి ప్రాంతీయ నేతలు వస్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు. అయితే మేం సొంతంగా మెజారిటీ సాధిస్తాం. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలకు 73కుపైగా గెలుచుకుంటాం. ఎస్పీ, బీఎస్పీ ఎన్ని కుయుక్తులు పన్నినా మోదీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేరు. "
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
ఇదీ చూడండి: 'ప్రచార మంత్రిని కాదు.. ప్రజల మనిషిని'