ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని రాయల్ హోలోవే విశ్వవిద్యాలయం నారాయణమూర్తిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కంప్యూటర్ సైన్స్ రంగానికి ఆయన అందించిన సేవలకు ఈ అవార్డు అందిస్తున్నట్లు వెల్లడించింది.
బ్రిటన్ సర్రే ప్రాంతంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో ఈ అవార్డునందుకున్నారు నారాయణమూర్తి.
"ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాయల్ హోలోవే విశ్వవిద్యాలయం ఈ విధంగా నా సేవలను గుర్తించింది. డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటున్న నూతన తరంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. వారి భావి జీవితం ఫలప్రదంగా, మంచి ఉద్యోగాలతో సాగాలని ఆకాంక్షిస్తున్నా."
-నారాయణ మూర్తి
నూతన తరం గ్రాడ్యూయేట్లు వారి విజ్ఞానం, నైపుణ్యాలతో ప్రపంచంలో సానుకూల మార్పులు తీసుకువస్తారని నారాయణమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నారాయణమూర్తి సహ వ్యవస్థాపకుడిగా స్థాపించిన ఇన్ఫోసిస్ 2.2 లక్షల ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా రూపుదిద్దుకుంది. ప్రతి త్రైమాసికంలో 3 బిలియన్ల అమెరికన్ డాలర్లను ఆర్జిస్తోంది.
2007లో బ్రిటన్ ప్రభుత్వం నారాయణమూర్తిని 'కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' గౌరవంతో సత్కరించింది.
ఇదీ చూడండి: సోమవారానికి కర్నాటకీయం వాయిదా!