కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు యాదృచ్ఛికంగానో లేదా మరో విధంగానో తెలియదు గాని ఆయన పేరులో మార్పు ఎన్నికల్లో కలిసొస్తుంది. పేరులో స్వల్ప మార్పు తర్వాత ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఉప ఎన్నికల్లో ఘన విజయంతో ప్రభుత్వాన్ని సుస్థిర పరుచుకున్నారు యడ్డీ.
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. గత జులైలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు యడియూరప్ప. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే కొద్ది గంటల ముందు సంఖ్యా శాస్త్రం ఆధారంగా తన పేరును 'యడ్యూరప్ప' నుంచి 'యడియూరప్ప'గా మార్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటమే కాదు.. విధానసభలో బల నిరూపణలో నెగ్గారు కూడా.
ఉప ఎన్నికల్లో విజయఢంకా..
ఇటీవల జరిగిన 15 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ.. అధికార భాజపా విజయఢంకా మోగించింది. 12 స్థానాలను కైవసం చేసుకుంది. కావాల్సిన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరపరుకుంది భాజపా.
గవర్నర్ లేఖతో బహిర్గతం..
ప్రభుత్వ ఏర్పాటుపై ఈఏడాది జులైలో గవర్నర్ వాజుభాయ్ వాలాకు లేఖ రాసిన క్రమంలో యడియూరప్పగా పేరు మార్పు బహిర్గతమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అధికారిక ఆహ్వానంలోనూ పేరును 'యడియూరప్ప'గానే పేర్కొన్నారు.
2007లో తొలిసారి...
2007లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే కొద్ది రోజుల ముందు ఆయన పేరులో మార్పు చేశారు యడ్డీ. యడియూరప్ప నుంచి యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే.. పదవి చేపట్టిన వారం రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ కూటమి భాగస్వామి జేడీఎస్‌తో అధికార పంపిణీలో విబేధాలతో ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం మరోమారు అవకాశం వచ్చినా ఎక్కువ రోజులు నిలవలేకపోయారు.
'యడ్యూరప్ప' పేరుతో ముఖ్యమంత్రిగా ఉన్న రెండు పర్యాయాలు ఆయనకు కలసి రాలేదు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించలేకపోయారు.
ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుపై సుప్రీంలో రిట్ పిటిషన్