ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి నిద్ర అనేది ఓ ఔషధం. రాత్రివేళల్లో తగినంత నిద్ర పోవటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా నాణ్యమైన, సురక్షితమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఇదే ఇతివృత్తంతో నిద్రలేమి సమస్యలపై చర్చించి, అభిప్రాయాలు పంచుకోవడానికి భారత్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.
నిద్ర రుగ్మతలపై అక్టోబర్ 12, 13న దక్షిణాసియా స్లీప్ మెడిసిన్ అకాడమీ నిర్వహించే ఐదో అంతర్జాతీయ సదస్సుకు నాగ్‌పుర్‌లోని చిట్నావిస్ సెంటర్ వేదిక కానుంది. అమెరికా, బ్రిటన్, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాలకు చెందిన నిపుణులు సదస్సులో పాల్గొని, నిద్ర రుగ్మతలపై చర్చించనున్నారు. సుఖమయ నిద్రకోసం తమ సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. సదస్సులో భాగంగా వైద్యులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
"నిద్రలేమి వల్ల తక్షణ హానితో పాటు, భవిష్యత్తులో కూడా చాలా చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. సరైన నిద్ర లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన ఆలోచనా తీరుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది."
-రాజేష్ స్వర్ణాకర్, వైద్యుడు