దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ముజఫర్‌పుర్ ఆశ్రమ బాలికల కేసులో కీలక తీర్పు వెలువరించింది దిల్లీ కోర్టు. దోషిగా తేలిన ఎన్జీఓ యజమాని బ్రజేష్ ఠాకుర్‌తో పాటు మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి సౌరభ్ కుల్శ్రేష్ఠ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది జనవరి 20న ఆశ్రమ కేసులో 19 మందిని దోషులుగా తేల్చింది దిల్లీ కోర్టు. మరొకరిని నిర్దోషిగా ప్రకటించింది. సామూహిక అత్యాచార ఆరోపణలు, పోక్సో చట్టం కింద నమోదైన కేసుపై విచారణ జరిగింది. సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని నిందితులను దోషులుగా తేల్చారు.
ఇదీ జరిగింది..
ముజఫర్‌పుర్‌లోని ఓ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో పలువురు బాలికలపై లైంగిక, భౌతిక దాడులు జరిగాయని, కొందరు హత్యకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)చేసిన పరిశోధనలో ఈ నిజాలు వెలుగుచూశాయి.
టిస్ నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం బిహార్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాల్సిందిగా సూచించింది. బిహార్ నుంచి దిల్లీలోని పోక్సో కోర్టుకు కేసు విచారణను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో మరో 16 ఆశ్రమాలపై విచారణ జరిపేందుకు సీబీఐ అనుమతి కోరింది. అనంతరం దర్యాప్తు చేపట్టి 13 ఆశ్రమాలపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు వివరాలను కోర్టుకు నివేదించింది. విచారణ సంస్థ ప్రవేశపెట్టిన ఆధారాల మేరకు 19మంది నిందితులను దోషులుగా తేల్చింది దిల్లీకోర్టు. ఇందులో బ్రజేష్ ఠాకుర్‌కు జీవిత ఖైదు విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.