కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి భరోసా కల్పించాలని కోరుతూ రైతులు, విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ఆందోళన మధ్యే బిల్లులకు ఆమోద ముద్ర వేసుకున్న కేంద్రం.. 2020-21 రబీ కాలానికి పలు పంటలకు మద్దతు ధర ప్రకటించింది. ఆరు రబీ పంటలకు క్వింటాలకు రూ.50 నుంచి రూ.300 వరకు పెంచింది.
స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకే ఎంఎస్పీని పెంచుతున్నామని ప్రభుత్వం అంటోంది. పంట సగటు వ్యయంతో పాటు దానిపై కనీసం 50 శాతం లాభాలను లెక్కించటం (సీ2+50% సూత్రం) ఆధారంగానే ఎంఎస్పీని నిర్ణయిస్తున్నట్లు చెబుతోంది.
ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచినప్పటికీ.. రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుత 2.6 శాతం పెంపు చాలా తక్కువని పేర్కొంటున్నాయి.
స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసిన సీ2+50% సూత్రం ప్రకారం కనీస మద్దతు ధరకు భరోసా కల్పించేందుకు చట్టం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
'పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అన్ని రాయితీలను ఉపసంహరించుకోవటం వల్ల సాధారణ వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.10.20 చొప్పున వసూలు చేసేలా విద్యుత్తు బిల్-2020 ఉంది. ఎరువుల రాయితీని కూడా ఉపసంహరించుకోవటం వల్ల ధరలు పెరగటం సహా బ్లాక్ మార్కెట్‌కు ఆస్కారం ఏర్పడింది. ధరల పెరుగుదలతో జీవన వ్యయం పెరిగిపోయింది. కానీ, 2.6 శాతం మాత్రమే కనీస మద్దతు ధర పెంచటం అతిపెద్ద జోక్. అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం 6 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించుకోగలుగుతున్నారు. మిగిలిన వారు.. వ్యాపారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సివస్తోంది' అని పేర్కొంది కమిటీ.
" 2019-20 సీజన్లో గోధుమల ఎంఎస్పీ రూ.1925గా ఉంది. కానీ ప్రస్తుతం క్వింటాల్ గోధుమలు రూ.1400 మాత్రమే పలుకుతోంది. దాంతో రైతులకు భారీగా నష్టపోతున్నారు. ప్రభుత్వం రైతు పక్షపాతి అయితే, వెంటనే కనీస మద్దతు ధరకు గోధుమలు కొనుగోలు చేయాలి. సాధారణంగా ఎంఎస్పీని అక్టోబర్‌లో ప్రకటిస్తారు. కానీ, రైతులకు మద్దతు ధర ఇచ్చామని చెప్పుకునేందుకే సెప్టెంబర్‌లో ప్రకటించారు. అయితే.. ఈ ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా? లేక ప్రకటించిన ఎంఎస్పీ వచ్చేలా భరోసా కల్పిస్తుందా? అనేది ప్రశ్న. కానీ అది ఎప్పటికీ జరగదు. గత ఏడాది మొక్కజొన్న మద్దతు ధర రూ.1760 కానీ, రైతులు క్వింటాలుకు రూ.700 నుంచి రూ.900లకే అమ్ముకున్నారు. రైతులకు ప్రయోజనం చేకూరనప్పుడు ఎంఎస్పీలతో ఉపయోగం ఏమిటి? అందుకే, కనీస మద్దతు ధరకు దిగువన ఎవరూ కొనకుండా ఎంఎస్పీ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తల కోసం మూడు బిల్లులు తీసుకొచ్చిన మాదిరిగానే రైతుల కోసం ఒక బిల్లు తీసుకురావాలి."
- వీఎం సింగ్, ఏఐకేసీసీ కన్వీనర్.
" ప్రస్తుత ఎంఎస్పీ పెంపు చాలా తక్కువ. ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ గోధుమలపై ఎంఎస్పీ పెంపు కేవలం 2.6 శాతంగా ఉంది. గోధుమలపై రైతులు 3.4 శాతం నష్టపోతున్నారు. ఒక్క మసూర్ తప్ప అన్ని పంటలు అలాగే ఉన్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా చూస్తే వాస్తవానికి ఎంఎస్పీ తగ్గింది."
- చౌదరి పుష్పేంద్ర సింగ్, కిసాన్ శక్తి సంఘ్ అధ్యక్షులు.
కనీస మద్దతు ధరపై భరోసా కల్పించాలని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే.. సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నాయిు.