బంగాల్ ప్రభుత్వ తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. భాజపా కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలున్నా ఆలస్యం జరగటంపై మండిపడింది. బంగాల్ సీఎం మమత బెనర్జీ చిత్రాన్ని మార్ఫ్ చేసినందుకు ప్రియాంక అరెస్ట్నూ తప్పుబట్టింది. నిరంకుశంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా అనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.
ప్రియాంకను అరగంటలో విడుదల చేయాలని బంగాల్ ప్రభుత్వానికి మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ విడుదల చేయలేదని ప్రియాంక సోదరుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే విషయమై బంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం వివరణ కోరగా... ఈరోజు ఉదయం 9.40 గంటలకు విడుదల చేశామని తెలిపింది. జైలు విధివిధానాల అమలుతో ఆలస్యమయిందని సమాధానమిచ్చింది. ఈ వివరణపైనా కోర్టు మండిపడింది.
"ఈ రోజు ఉదయం 9.40కి ఎందుకు? మీ ముందే ఆదేశాలు జారీ అయ్యాయి కదా. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు జైలు నిబంధనలు ఎలా పనిచేస్తాయి? ఇది సరైనది కాదు. ముందుగా మీరు చేసిన అరెస్ట్ కూడా ఏకపక్షంగానే ఉంది. "
-సుప్రీంకోర్టు ధర్మాసనం
ఇటీవల న్యూయార్క్ మెట్ గలా కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వేషధారణతో ఉన్న చిత్రంలో దీదీ ఫొటోను మార్ఫ్ చేశారు భాజపా కార్యకర్త ప్రియాంక. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. స్థానిక తృణమూల్ నేత ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 500 పరువు నష్టం దావా కింద ప్రియాంక శర్మపై కేసు నమోదు చేశారు. 14 రోజుల న్యాయ నిర్బంధం విధిస్తూ హావ్డా కోర్టు తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: రాళ్లదాడిపై భాజపా- తృణమూల్ మాటల యుద్ధం