ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినట్లే. మండిపోతున్న ఎండలకు వీడ్కోలు పలుకుతూ వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరాన్ని తాకినట్లు పేర్కొంది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఈ ఏడాది వారం ఆలస్యంగా తీరాన్ని తాకాయి రుతుపవనాలు.
తొలుత 6 రోజులు ఆలస్యంగా జూన్ 6నే కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది ఐఎండీ.
ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు నెలల పాటు వర్షాకాలం కొనసాగనుంది. దాదాపు 75 శాతం వర్షపాతం ఈ కాలంలోనే నమోదు కానుంది. దేశంలో వర్షాధార సాగే ఎక్కువ.
భారత వృద్ధిరేటులో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఫలితంగా.. రుతుపవనాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి.
ఉత్తరాదిన మరింత ఆలస్యం...
ఉత్తర ప్రాంతంలో వర్షాలు మరింత ఆలస్యంగా ప్రారంభం అవుతాయని అంచనా వేసింది ఐఎండీ. దిల్లీలో రుతుపవనాలు జూన్ 29 కంటే రెండు, మూడు రోజులు ఆలస్యంగా తాకనున్నాయని పేర్కొంది. అయితే.. వారం ఆలస్యంగా తాకుతాయని అంచనా వేసింది స్కైమెట్.
దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఇప్పటికే పేర్కొంది వాతావరణ శాఖ.