భారత పౌరులు, సంస్థలు... స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు నిల్వలు తగ్గిపోయాయి. భారత్ ఒక స్థానం దిగజారి 74వ ర్యాంకుకు చేరుకుంది. ఈ విషయంలో యూకే మరోమారు అగ్రస్థానాన్ని నిలుపుకుంది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి.
రెండేళ్ల క్రితం 88వ స్థానంలో ఉన్న భారత్... గతేడాదికి 15 స్థానాలు ఎగబాకి 73వ ర్యాంకుకు చేరుకుంది.
స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) తాజాగా వార్షిక బ్యాంకింగ్ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాలు... భారత పౌరులు, సంస్థలు... స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము చాలా తక్కువని చెబుతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో విదేశీ ఖాతాదారులందరూ దాచుకున్న నిధుల్లో ఇది కేవలం 0.07 శాతమని స్పష్టం చేస్తున్నాయి.
టాప్-5 ఎవరంటే...
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న యూకే విషయానికి వస్తే... 26 శాతం నిధులు స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి. యూకే తరువాత అమెరికా, వెస్ట్ఇండీస్, ఫ్రాన్స్, హాంగ్కాంగ్ టాప్-5 ర్యాంకుల్లో ఉన్నాయి.
స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న విదేశీ ఖాతాదారుల నిధుల్లో ఈ 5 దేశాల వాటా 50 శాతం కావడం విశేషం. టాప్-10 దేశాలను తీసుకుంటే 2/3 వంతుల నిధులు ఆ దేశాలవే ఉంటాయి. టాప్-15 దేశాలు తీసుకుంటే 75 శాతం నిధులు ఉంటాయి.
బ్రిక్స్ దేశాల్లో...
స్విస్ బ్యాంకుల్లో నిధులు దాచుకున్న బ్రిక్స్ దేశాల విషయానికొస్తే... 2018 సంవత్సరానికి రష్యా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ చివరి స్థానంలో నిలిచింది. రష్యా-20, చైనా-22, దక్షిణాఫ్రికా-60, బ్రెజిల్-65వ ర్యాంకుల్లో ఉన్నాయి.
ఇరుగుపొరుగుతో పోల్చుకుంటే..
భారత్ పొరుగుదేశాలు మాత్రం మన కంటే ఈ విషయంలో వెనుకబడ్డాయి. పాకిస్థాన్ -82, బంగ్లాదేశ్-89, నేపాల్-109, శ్రీలంక-141, మయన్మార్ -187, భూటాన్-193 స్థానాల్లో ఉన్నాయి.
99 లక్షల కోట్లకు తగ్గింది..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీ ఖాతాదారులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము 2018 సంవత్సరానికి (4 శాతం) 99 లక్షల కోట్లకు పడిపోయింది. యూకే నుంచి 372 బిలియన్ డాలర్లు స్విస్ బ్యాంకుల్లో ఉంది. భారత్ విషయానికి వస్తే 6 వేల 757 కోట్లు.. స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: ట్రంప్-కిమ్ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్