ప్రభుత్వ అధికారి సంజీవ్ చతుర్వేది ప్రధానమంత్రికి లేఖ రాశారు. 2014లో అప్పటి ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్‌తో ప్రధాని మోదీ చేసిన సంభాషణ వివరాలు కావాలని కోరారు. ఇరు నేతల మధ్య సంభాషణ ఎయిమ్స్‌లో విజిలెన్స్ అధికారి పదవి నుంచి తనను తొలగించేలా చేసిందని ఆరోపించారు. చతుర్వేది ఫిబ్రవరి 28న లేఖ రాసినప్పటికీ అందులోని అంశాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.
తన విషయమై కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు చతుర్వేది. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్న వారిపై, పలుపురు కేంద్రమంత్రులపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తు పురోగతిని బయటపెట్టి వారిపై తగు రీతిలో జవాబివ్వాలని కోరారు.
తనను ఏ కారణం వల్ల తొలగించారన్న స.హ దరఖాస్తుకు ఆగస్టు 23, 2014న ప్రధానమంత్రి కార్యాలయం లిఖిత పూర్వక జవాబిచ్చిందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రితో ప్రధాని చర్చించిన అనంతరమే ఎయిమ్స్ విజిలెన్స్ బాధ్యతల నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని పీఎంవో సమాధానమిచ్చిందని తెలిపారు.
ఇంతకుముందు హరియాణా ప్రభుత్వంలో చతుర్వేది పనిచేశారు. అక్కడా ఇదే విధమైన వేధింపులను ఎదుర్కొన్నారాయన.
సున్నా ఇవ్వడమేంటి
ఇటీవల ప్రకటించిన సంవత్సర ప్రగతి నివేదికలో సంజీవ్ చతుర్వేదికి సున్నా ఇవ్వడంపై ఉత్తరాఖండ్ హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మందలించింది. రూ.25వేల జరిమానా విధించింది. ఈ కేసులో సుప్రీంను ఆశ్రయించింది కేంద్రం. కేసును పరిశీలించిన అనంతరం అదనంగా మరో రూ. 25వేల జరిమానా విధించింది సుప్రీంకోర్టు.
సంజీవ్ చతుర్వేది 2002 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. 2012 నుంచి 2016 వరకు దిల్లీ ఎయిమ్స్ అవినీతి నిరోధక అధికారిగా పనిచేశారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న అవినీతిని ఆయన బయటపెట్టారు.