భయాందోళన కలిగించే వాతావరణంలో మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడ్డారు. గాంధీ పేరు చెప్పుకుని కాలం వెళ్లదీస్తూ... ఆయన సిద్ధాంతాలనే కాలరాస్తున్నారని ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.
తమ హయాంలో సామాన్య ప్రజల కోసం తెచ్చిన.. మన్రేగా(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం), ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం)లను కేంద్రం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు సోనియా. బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహరిలో మహాత్ముని జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ 'గాంధీ చేతన ర్యాలీ'ని శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సోనియా వర్చువల్గా హాజరయ్యారు.
" కొంత మంది మహాత్ముని పేరు చెప్పుకుని కాలం గడుపుతారు. కానీ తమ చర్యలతో గాంధీ సిద్ధాంతాలను, సూత్రాలను నాశనం చేస్తారు. ప్రతిచోట అరాచకం కనిపిస్తోంది. సమాజంలో వివక్షను సృష్టించి, అమాయకులపై దాడి చేస్తున్నారు. భావోద్వేగ, భ్రమ, భయానక వాతావరణాన్ని సృష్టించి పాలన సాగిస్తున్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలి."
-- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
గాంధీ సిద్ధాంతాలే తమ పార్టీకి ఆత్మ, పరమాత్మ అని సోనియా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వైపు సామాన్య ప్రజలు మొగ్గు చూపుతారని అన్నారు. యూపీఏ హయాంలో మహిళలు, కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.
'పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రయత్నించినప్పుడల్లా... కొన్ని శక్తులు మాకు వ్యతిరేకంగా నిలుస్తాయి. కొవిడ్ సంక్షోభ సమయంలో మన్రేగా పథకం లేనట్లయితే.. ఏం జరిగి ఉండేదో ఆలోచించండి. చాలా మంది ఆకలితో అలమటించేవారు. ఈ రోజుల్లో కొద్ది మంది మాత్రమే ధనవంతులవుతున్నారు. లక్షలాదిమంది తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.' అని సోనియా అన్నారు.
ఇదీ చూడండి: 'హాథ్రస్లో యోగి ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తోంది'