ప్రధాని మోదీపై విమర్శలకు పదును పెంచారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తానన్న మోదీ ఇప్పటి వరకు ఒక్కరికీ బదిలీ చేయలేదని విమర్శించారు. మోదీలా తాము తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు మేలు చేసే 'న్యాయ్' పథకాన్ని అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6వేలు అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు రాహుల్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణా జగాధరిలో కాంగ్రెస్ బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. అంబానీ వంటి 15 మంది ధనికులకు రూ.3.5లక్షల కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, రైతులు రుణమాఫీ చేయమని అభ్యర్థిస్తే మాత్రం పట్టించుకోరని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులపై పన్ను భారం తగ్గేలా జీఎస్టీకి మార్పులు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
"హరియాణా, మధ్యప్రదేశ్ రైతులు రేయింబవళ్లు కష్టపడతారు. ఉదయం 4 గంటల నుంచే పనులు ప్రారంభిస్తారు. రుణమాఫీ చేయమని అడిగితే, జైట్లీ ససేమిరా అంటారు. అది మా విధానం కాదని చెబుతారు. బీమా పాలసీలకు మాత్రం మీకు చెప్పకుండానే మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బును అనిల్ అంబానీ, అదానీ సంస్థలకు మళ్లిస్తారు. బ్యాంకు తాళాలను నరేంద్రమోదీ అంబానీ చేతిలో పెట్టారు. అంబానీ, నీరవ్ మోదీల దగ్గరున్న బ్యాంకు తాళాలను మేము తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించాలనుకునే యువకుల చేతుల్లో పెడతాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు