కరోనా కట్టడిలో డెన్మార్క్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశంలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినా కేసుల సంఖ్య పెరగకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలను కొనియాడారు. ఈ మేరకు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్తో ఫోన్లో సంభాషించారు మోదీ. దృఢమైన వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇరు దేశాలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కరోనా కట్టడిలో భారత్, డెన్మార్క్‌లు పరస్పర సహకారం అందించుకుంటాయని అధికారిక ప్రకటనలో తెలిపింది కేంద్రం. కరోనాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని పంచుకుంటామని స్పష్టం చేసింది. భారత్-డెన్మార్క్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు.. భవిష్యత్తులో మరింత బలోపేతమయ్యే విషయంపై రెండు దేశాల ప్రధానులు చర్చించినట్లు ప్రకటనలో పేర్కొంది.
ఆరోగ్య పరిశోధన, పరిశుభ్రత, హరిత, శక్తి, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం సహకారం అందించుకొని.. వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్య సాధనకు కృషి చేయనున్నట్లు ఇరు దేశాలు స్పష్టం చేశాయి.
భారత్‌లో మే 18నుంచి నాలుగో విడత లాక్డౌన్ ఉంటుందని.. ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపారు మోదీ. ఈసారి నిబంధనలు కొత్తగా ఉంటాయని స్పష్టం చేశారు.