దేశ భద్రతా విధుల్లో ఉన్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనలో తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు మోదీ.
భారత్ ఇక ఎప్పటికీ నిస్సహాయ దేశం కాదు. ఉరీ దాడి జరిగినప్పుడు మీరు మన సాహస సైనికుల వీరత్వాన్ని చూశారు. పుల్వామా జరిగినప్పుడు మన వాయుసేన ఏం చేసిందో చూశారు. దేశ భద్రత కోసం సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నా. వారి కాపలాతో మన దేశం భద్రంగా ఉంది. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం. నిర్మూలిస్తూనే ఉంటాం. ఇదే నవభారతం.
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఉగ్రవాద నిర్మూలనలో విఫలమైందని విమర్శించారు మోదీ. లక్షిత దాడులు చేపట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు.
2004-2014 వరకు అనేక ఉగ్రదాడులు జరిగాయి. అనేక చోట్ల బాంబులు పేలాయి. దోషులకు కఠినశిక్ష పడాలని దేశం కోరుకుంది. కానీ ఏం జరగలేదు. 26/11న భీకర దాడి జరిగింది. ఏ చర్యా లేదు. అప్పుడు వాయుసేన లక్షిత దాడులు చేయాలని అనుకుందని వార్తలు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం దీనిపై ఏమీ చేయలేదు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని వార్తలు వచ్చే కాలంలో ఉన్నాం. ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి