రెండో సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేయబోయే విదేశీ పర్యటన ఖరారైంది. జూన్ 7, 8 తేదిల్లో మాల్దీవుల్లో మోదీ పర్యటించనున్నారని అధికారులు వెల్లడించారు.
ప్రధానమంత్రి మోదీ 2018 నవంబర్‌లో మాల్దీవులకు వెళ్లారు. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోహైల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. సామాజిక, ఆర్థిక పరంగా మద్దతు కోసం మాల్దీవులకు 1.4 బిలియన్ డాలర్లను సహాయంగా అందిస్తామని ప్రకటించింది భారత్.
గతేడాది డిసెంబర్లో మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ భారత్‌లో పర్యటించారు. ఆయన పర్యటనలో ఆరోగ్యం, నేరపరిశోధన, పెట్టుబడులకు ప్రోత్సాహం, మానవ వనరుల అభివృద్ధి, పర్యటక రంగాల్లో పరస్పర సహకారానికై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.
రెండు దేశాల మధ్య రాకపోకలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని, దీనికోసం అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వస్తు సేవలు, సమాచారం, ఆలోచనలు, సంస్కృతి వంటి రంగాల్లో సహజసిద్ధంగా అవగాహన పెరిగి, భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: ప్రపంచ కప్‌పై మోదీ, థెరెసా మే చర్చ