గుజరాత్ కేవడియాలో పర్యటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తన జన్మదినం సందర్భంగా సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించారు. అనంతరం కేవడియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని కొనియాడారు ప్రధాని. ఆయన స్ఫూర్తితోనే జమ్ముకశ్మీర్ అంశంపై దేశ ప్రజలంతా కలిసి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
" సెప్టెంబరు 17కు మరో గొప్ప ప్రత్యేకత ఉంది. ఇదే రోజు భారత్‌ను ఏకం చేయాలనే ప్రయత్నాలను పటేల్ మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో సెప్టెంబరు 17ను సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు హైదరాబాద్ విమోచన దినం. ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. పటేల్ దూరదృష్టితో ఆలోచించకుంటే భారత్ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. ఎన్నో సమస్యలు ఉండేవి. భారత్‌ను ఏకం చేయాలన్న పటేల్ కల నేడు సాకారం కావడం చూస్తున్నాం. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు 70 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ దుష్పరిణామాలను హింస, ఇతర రూపాల్లో దేశం చూసింది. సర్దార్ ప్రేరణతో దేశం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
ఐక్యత విగ్రహానికి పర్యటకుల తాకిడి
సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహానికి పర్యటకుల తాకిడి పెరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు మోదీ. అమెరికాలో 133ఏళ్ల చరిత్ర ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రోజుకు 10వేల మంది సందర్శకులు వస్తే.. 11నెలల క్రితం నిర్మితమైన పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించేందుకు రోజుకు 8,500 మంది పర్యటకులు వస్తున్నారని చెప్పారు.
ఇదీ చూడండి: మోదీ పుట్టిన రోజున స్వర్ణ కిరీటం బహూకరణ