దేశంలో బలమైన (భాజపా) కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 నుంచి ఇప్పటి వరకు 400 కి.మీ పొడవైన మెట్రో మార్గాలు అనుసంధానం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగపూర్ మెట్రోను ప్రధాని ప్రారంభించారు. ఖాప్రి-సితాబుర్డీలను కలుపుతూ 13.5 కి.మీల నాగపూర్ మెట్రో పయనిస్తుంది.
"నాగపూర్ మెట్రో 'హరిత రైలు వ్యవస్థ' కలిగి ఉండి కాలుష్య రహిత రవాణాకు ఉపకరిస్తుంది. చిన్న వాహనాలపై ఆధారపడే ప్రజలకు ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కాంగ్రెస్ వైఫల్యం
పట్టణాల్లోని ట్రాఫిక్ రద్దీని నివారించడానికి అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్ట్‌లకు నాంది పలికిందని ప్రధాని తెలిపారు.
"2004 నుంచి 2014 వరకు (కాంగ్రెస్) ఓ నిస్సహాయ ప్రభుత్వం కేవలం 250 కి.మీ మెట్రో మార్గాలను నిర్మించింది. కానీ బలమైన ప్రభుత్వ (భాజపా) హయాంలో, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ స్వల్పకాలంలోనే 650 కి.మీ మెట్రో మార్గాలను నిర్మించాం. మరో 800 కి.మీ మెట్రో మార్గాల నిర్మాణపనులు జరుగుతున్నాయి."-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశంలో ప్రజారవాణా వ్యవస్థ విస్తృతికి భాజపా కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 800 కి.మీ మెట్రో మార్గాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. ఫలితంగా రవాణా మార్గాలు విస్తృతమై ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. నాగపూర్ మెట్రో వల్ల సుమారు 20 వేల ఉద్యోగాలు సృష్టించబడుతాయని మోదీ అన్నారు.
కామన్ మొబిలిటీ కార్డు
కామన్ మొబిలిటీ కార్డుతో రైలు ప్రయాణాలు చేయడమే కాకుండా, అది ఆన్లైన్ చెల్లింపులకు కూడా ఉపయోగపడుతుందని మోదీ స్పష్టం చేశారు. రూపే కార్డు, భీమ్ యాప్, కామన్ మొబిలిటీ కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులకు మార్గం సుగమమం చేస్తాయని మోదీ తెలిపారు.