ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే సుదీర్ఘకాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు నెలకొల్పిన ఆయన.. తాజాగా మరో గౌరవం దక్కించుకున్నారు. అత్యధిక కాలం ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రిగా కీర్తి గడించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లకు పైగా పాలించిన మోదీ.. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో మొత్తం 18 ఏళ్ల 306 రోజుల పాటు ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధానిగా రికార్డు సాధించారు.
నెహ్రూ, ఇందిరా మోదీ తర్వాతే
ఆ తర్వాతి స్థానంలో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ప్రధానిగా ఆయన 16 సంవత్సరాల 286 రోజులు పనిచేశారు. అయితే నెహ్రూ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహించలేదు.
అదేవిధంగా ఇందిరా గాంధీ కేవలం ప్రధాని పదవిలోనే 15 సంవత్సరాల 350 రోజులు విధులు నిర్వహించారు. అత్యధిక కాలం ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన ప్రధాని జాబితాలో ఇందిరా మూడోస్థానంలో ఉన్నారు.
ముఖ్యమంత్రులుగా ఉన్నా..
బంగాల్‌కు చెందిన జ్యోతి బసు, సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ వంటి కొందరు ముఖ్యమంత్రులు మోదీతో పోలిస్తే అత్యంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే వీరిలో ఎవరూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టలేదు.
మరో నాలుగు సంవత్సరాలు ప్రధానిగా మోదీ కొనసాగనున్న నేపథ్యంలో.. తాజాగా నమోదైన రికార్డు చాలా కాలంపాటు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇదీ చదవండి- మోదీ మరో ఘనత- ఆ జాబితాలో 4వ స్థానం