బడ్జెట్ 2020లో ప్రకటించిన నూతన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పద్దు.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి.. ఆశాజనకమైన భవిష్యత్తును అందిస్తుందని కొనియాడారు.
"'కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన' అన్న కేంద్ర విధానాన్ని ఈ బడ్జెట్ మరింత బలోపేతం చేసింది. ఫేస్‌లెస్ అప్పీల్ వెసులుబాటు, ప్రత్యక్ష పన్నుకు ఇచ్చిన నూతన, సరళమైన రూపు, పింఛను పథకాల్లో ఆటో ఎన్రోల్మెంట్, యూపీఎస్(యూనిఫైడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్)వైపు అడుగులు వేయడం వంటి చర్యలు.. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించి.. సమాజంలో వారి శక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. వారికి మైరుగైన జీవితాన్ని అందించాలనుకున్న మా సంకల్పం నెరవేరుతుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్‌లో అనేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు మోదీ. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర సంకల్పానికి బడ్జెట్ దోహద పడుతుందని ఉద్ఘాటించారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల దేశంలోని యువతకు నూతన ఉత్తేజాన్ని ఈ బడ్జెట్ అందిస్తుందని అభిప్రాయపడ్డారు.
మోదీ చెప్పిన మరిన్ని అంశాలు...
- ఆదాయాలు, పెట్టుబడులు పెంచే దిశగా బడ్జెట్ ఉంది.
- డిజిటల్ అనుసంధానంతో విద్యా అవకాశాలు మెరుగవుతాయి
- ఆన్‌లైన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ విధానాలు, విదేశాలకు వెళ్లే వారి కోసం బ్రిడ్జ్ కోర్సులు
- దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు
- బడ్జెట్‌లో స్మార్ట్‌సిటీలు, డేటా సెంటర్ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు
- యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు
ఇదీ చూడండి:- బడ్జెట్‌పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం