భారత దేశం ఎప్పుడూ ఆశ్చర్యాలకు నిలయమే. ఇతర దేశాల రాజకీయాలకు వర్తించే తూకపురాళ్లు ఇక్కడ ఒక పట్టాన పనిచేయవు. మన దేశంలో బహుళపార్టీ ప్రజాస్వామ్యం ఎంతో కాలం నిలబడదని స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో చాలామంది పాశ్చాత్య మేధావులు వ్యాఖ్యానించారు. ఆనాటికి ప్రజాస్వామ్యం బాగా పాదుకున్న దేశాలన్నీ అభివృద్ధిలో బాగా ముందుభాగాన ఉన్నాయి. పార్టీల మంచిచెడులపై వివేచన జరిపే స్థాయి దారిద్య్రంలో బతుకుతున్న ప్రజలకు ఉండదని, మెజారిటీ ప్రజలు నిరక్ష్యరాసులుగా ఉన్న దేశంలో ఆ స్థాయి ఇంకా అధ్వాన్నంగా ఉంటుందని వాళ్లు నమ్మారు. ఈ నమ్మకాలు, అంచనాలు కాలక్రమంలో తలకిందులయ్యాయి. అత్యవసర పరిస్థితిని విధించిన దాదాపు రెండేళ్లు మినహా మన ప్రజాస్వామ్యం చాలా దేశాలతో పోల్చితే ఘనంగానే ఉంది.
దేశంలో ప్రజాస్వామ్యం సుస్థిరం అయిన తరవాత సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యాయి. 1989 నుంచి 2014 సంవత్సరాల మధ్య రాజకీయాలను లోతుగా చూసినవాళ్లు దేశంలో సంకీర్ణ రాజకీయాలదే భవిష్యత్తని నమ్మారు. సంకీర్ణ రాజకీయాల్లో కొంత సుస్థిరత లోపించినా దేశంలో సమాఖ్య వ్యవస్థ బాగా బలపడటానికి అవి దోహదం చేస్తాయని విశ్లేషించారు. 2014 ఎన్నికల ఫలితాలు ఈ అంచనాలను ఒక కుదుపు కుదిపాయి. ఇక 2019 ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాయి. ఏక పార్టీ పాలన దేశంలో కొంతకాలం కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. సంపూర్ణ ఆధిక్యతతో ఒక పార్టీ కేంద్రంలో, ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు మితిమీరిన కేంద్రీకృత పాలనకు దారితీసిన చరిత్ర మనకుంది. అది పునరావృతం అవుతుందా, లేక ఒక స్థాయి వరకే కేంద్రీకృత పాలన పరిమితమవుతుందా అన్న ప్రశ్నలపై చర్చలు మొదలయ్యాయి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని తీసివేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో కేంద్రీకృత పాలనపై సహజంగానే ఆందోళనలు మొదలయ్యాయి.
వడివడిగా మార్పులు
అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయే క్రమం మొదలైందని గట్టిగా భావించేవాళ్లు ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కొన్ని సవరణ చట్టాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో మొదటిది జాతీయ దర్యాప్తు సంస్థ చట్టానికి తీసుకువచ్చిన సవరణ. దీనివల్ల తీవ్రవాద సంబంధిత కేసులనే గాక మహిళలను, పిల్లలను బలవంతంగా వ్యభిచారంలోకి, ఇతర చట్టవిరుద్ధ కలాపాల్లోకి దించే చర్యలనూ దర్యాప్తుచేసే అధికారం కేంద్ర సంస్థకు లభించింది. దొంగనోట్లు, ఆయుధాల అక్రమ తయారీ, సైబర్ టెర్రరిజం లాంటివీ జాతీయ దర్యాప్తు సంస్థ పరిధిలోకి వచ్చాయి. ఇవన్నీ రాష్ట్ర పోలీసుల పరిధిలోనూ ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ సవరణ వల్ల కేంద్ర ఏజెన్సీకి ఈ కేసుల్లో స్వతంత్రంగా దర్యాప్తు చేసే వెసులుబాటు లభించింది. పైగా దర్యాప్తు పరంగా రాష్ట్ర పోలీసు అధికారులకు ఉండే అధికారాలన్నీ కేంద్ర సంస్థకూ దఖలు పడ్డాయి. రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా అవసరమనుకుంటే సోదాలు, అరెస్టులు చేయొచ్చు. రెండోది, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి తీసుకువచ్చిన సవరణ. ఇది కూడా కేంద్రానికి విస్తృత అధికారాలు కల్చించేదే. సవరణకు ముందు కొన్ని సంస్థలను మాత్రమే టెర్రరిస్టు సంస్థలుగా ప్రకటించే అధికారం కేంద్రానికి ఉండేది. ఈ సవరణ వల్ల ఒక వ్యక్తిని కూడా టెర్రరిస్టుగా ప్రకటించవచ్చు. దేశానికి వ్యతిరేకంగా విదేశాల్లో ఉంటూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై దర్యాప్తు చేపట్టడమే సవరణ ఉద్దేశమని హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో హామీ ఇచ్చారు.
దేశం వెలుపలే గాక లోపలా తీవ్రవాద కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడుతున్నారనేందుకు ఆధారాలు దొరికితే అటువంటివారి ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే స్వాధీనం చేసుకోవచ్చు. తీవ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తుల ఆస్తులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న నేపథ్యంలో ఈ అధికారాలు అవసరమని కేంద్రం వాదించింది. మూడోది, సమాచారహక్కు చట్టానికి తీసుకు వచ్చిన సవరణ. ఈ సవరణకు ముందు కేంద్ర సమాచార ముఖ్య, ఇతర కమిషనర్లకు అయిదేళ్లపాటు లేక 65 సంవత్సరాల వయసు వరకూ పదవీకాలం ఉండేది. రాష్ట్రాల్లోని ముఖ్య, ఇతర కమిషనర్లకూ ఇదే నిబంధన అమలులో ఉండేది. సవరణ వల్ల పదవీ కాలాన్ని నిర్దేశించే అధికారం ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సవరణకు ముందు కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ జీతభత్యాలు కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్‌కు సమానంగా ఉండేవి. మిగతా కమిషనర్ల జీత భత్యాలు ఎన్నికల కమిషనర్లకు సమానంగా లభించేవి. సవరణ ద్వారా ఈ నిబంధననూ తొలగించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్య సమాచార కమిషనర్ జీతభత్యాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జీతభత్యాలకు సమానంగా ఉండేవి. అలాగే ఇతర కమిషనర్ల జీతభత్యాలు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి స్థాయికి సమానంగా లభించేవి. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోనూ జీతభత్యాలను ఇక కేంద్రమే నిర్ణయిస్తుంది. సమాచార హక్కు ఉద్యమకారులు, సమాచార కమిషనర్లుగా పూర్వం వ్యవహరించినవారు ఈ సవరణలను తీవ్రంగా దుయ్యబట్టారు.
పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారాన్ని చేతిలో పెట్టుకోవడం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని కేంద్రం బలహీనపరుస్తోందని బహిరంగంగానే విమర్శించారు. ఇక నాలుగోది, జాతీయ వైద్య కమిషన్ చట్టం. నిజానికిది సవరణ కాదు. సంపూర్ణ చట్టం. దీనిపై వివిధ రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జాతీయ వైద్య కమిషన్‌కు విస్తృతాధికారాలు ఇవ్వడాన్నే ప్రధానంగా విమర్శిస్తున్నారు. వైద్య విద్యకు సంబంధించిన కీలక విధానాలను ఈ కమిషనే రూపొందిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిషన్లు కేంద్ర విధానాలకు అనుగుణంగా పనిచేసేట్లు కూడా నిర్దేశించే అధికారం జాతీయ వైద్య కమిషన్‌కు ఉంటుంది. ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాల్లో 50 శాతం సీట్లకు రుసుముల నిర్దేశానికి మార్గదర్శకాల రూపకల్పన కూడా జాతీయ కమిషన్‌కే ఉంటుంది. ఈ చట్టం కింద వైద్య సలహా మండలినీ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎమ్‌ఏఆర్‌బీ)తో పాటు మరికొన్ని స్వతంత్ర బోర్డులు ఏర్పాటవుతాయి. కొత్త వైద్యకళాశాలకు అనుమతిచ్చే అధికారం ఎమ్‌ఏఆర్‌బీకి ఉంటుంది.
డిగ్రీ వైద్యవిద్య చివరి సంవత్సరంలో నేషనల్ ఎగ్జిట్ టెస్టును కూడా ఇకపై నిర్వహిస్తారు. అయిదోది, దేశంలోని ఆనకట్టల (డ్యాముల) భద్రత కోసం ఉద్దేశించిన బిల్లు. దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వివిధ రాష్ట్రాల్లోని చాలా ఆనకట్టలు ప్రతిపాదిత చట్ట పరిధిలోకి వస్తాయి. వాటి పరిరక్షణకు జాతీయ కమిటీ ఏర్పాటవుతుంది. మొత్తం 20 మంది ఇందులో ఉంటారు. అందరినీ కేంద్ర ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. 10 మంది వరకూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడుగురు రాష్ట్రాల నుంచి ఉంటారు. ముగ్గురు డ్యాముల భద్రతా నిపుణులకూ ఇందులో చోటు కల్పిస్తారు. జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటవుతుంది. రాష్ట్రాల స్థాయిలో ఆనకట్టల భద్రత సంస్థలు ఏర్పాటవుతాయి. రెండు మూడు రాష్ట్రాలకు హక్కున్న డ్యాములపై అవసరమైన సందర్భాల్లో జాతీయ ప్రాధికార సంస్థదే తుది నిర్ణయంగా ఉంటుంది. ఈ చట్టాల నిబంధనలను జాగ్రత్తగా పరిశీలిస్తే కేంద్ర అధికారాలు అన్ని విధాలుగా విస్తృతం అయినట్టు స్పష్టంగా కనపడుతుంది. వీటిని ఆచరణలో ఎలా ఉపయోగిస్తారన్న దానిపైనే అసలు విషయం ఆధారపడి ఉంటుంది.
అతి చేస్తే అనర్థం
పార్లమెంటులో, ఎక్కువ రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే కేంద్రీకృతం వైపు వ్యవహారాలు నడవడం సహజంగా జరుగుతుంది. అయితే గతానికి, ఇప్పటికీ ప్రధానంగా ఒక తేడా ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలకు పూర్వం అన్నీ కేంద్రం చేతిలోనే ఉండేవి. అన్నింటికీ లైసెన్సులు, పర్మిట్‌లే. దీన్నే రాజాజీ ‘లైసెన్స్-పర్మిట్‌రాజ్’గా వర్ణించారు. పీవీ నరసింహారావు హయాములో ఆరంభమైన ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల రాష్ట్రాలకు ఎనలేని స్వేచ్ఛ వచ్చింది. దేశదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. రుణాలను తెచ్చుకోవచ్చు. విదేశీ పరిశ్రమలనూ ఆహ్వానించవచ్చు.
సంకీర్ణ రాజకీయాలకంటే ఆర్థిక సరళీకృత విధానాల వల్లే సమాఖ్య వ్యవస్థ బాగా బలపడింది. సరళీకృత ఆర్థిక విధానాల విస్తృతి పెరిగేదే తప్ప తరిగేది కాదు. ఇప్పటి కేంద్రీకృత రాజకీయాలకు దీనివల్లే ఒక పరిమితి అంటూ ఉంది. ఇది వాస్తవానికి ఒక వైపు చిత్రమే. కేంద్ర స్థాయిలో ప్రతిపక్షం, రాష్ట్రాల స్థాయుల్లో ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామికంగా పటిష్ఠంగా వ్యవహరించలేకపోవడం- సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా పరిణమిస్తోంది. అనేక ప్రాంతీయ పార్టీలు కుటుంబాల ఆధిపత్యాల కిందే ఉన్నాయి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజకీయంగా ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం అధికార కేంద్రీకరణ సాగుతూనే ఉంటుంది. అన్ని రకాల కేంద్రీకరణను ఒకే గాటన కట్టలేం. దేశమంతా సమాచార విస్తృత సదుపాయాలతో ఏకమవుతున్న నేపథ్యంలో కేంద్రీకృత వ్యవస్థలెన్నో అవసరం. వస్తుసేవల పన్ను చట్టం అలాంటిదే. అలాగే సాంకేతిక, వైద్య, ఉన్నత విద్యకు సంబంధించి జాతీయస్థాయి సంస్థలు పటిష్ఠంగా ఉండాలి. పర్యావరణం, ప్రకృతి వనరులు, నదీజలాల వినియోగంలోనూ జాతి మొత్తం అవసరాల ప్రాతిపదికనే కేంద్రీకృత వ్యవస్థలు, విధానాలు ఉండాలి.
ఒకప్పుడు ప్రకృతిని జయించడం చాలా గొప్ప. అడవులను కడతేర్చి మంచి మాగాణులను సృష్టించడం గొప్ప నాగరిక చర్య. పర్యావరణ జ్ఞానంతో ఈ దృక్పథాన్ని ఇప్పుడెవరూ గొప్ప అనడం లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు గొప్ప నాగరిక చర్య. అసలు సమస్య కేంద్రీకృత వ్యవస్థలతో కాదు... వాటి ఏర్పాటులో, వాటి పరిపాలనా యంత్రాంగంలోనూ రాష్ట్రాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించలేకపోతేనే ఆందోళన తలెత్తుంది. కేంద్రీకృత వ్యవస్థలను రాజకీయ ఆధిపత్యం కోసం వాడుకుంటేనే సమాఖ్యస్ఫూర్తికి దెబ్బ తగులుతుంది. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న కేసుల విషయంలో సీబీఐ సమర్థంగా వ్యవహరించలేకపోతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఇటీవల వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం. అందుకే అవసరాన్ని మించి కేంద్రీకరణ సాగుతుంటే, దాన్ని ఆధిపత్యం కోసం ఉపయోగించుకుంటుంటే ప్రశ్నించే గొంతుకలే ఇప్పటి అవసరం!
- ఆర్కే నాదెళ్ల
ఇదీ చూడండి:వినియోగదారులకు రక్షకవచం... కొత్త చట్టంలో కఠిన నిబంధనలు.