జీఎస్టీ, నోట్ల రద్దుతో చిన్న దుకాణదారుల జీవితాలను నాశనం చేసినట్టే.. వ్యవసాయ చట్టాలతో రైతులు, కార్మికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో 'ఖేతీ బచావో' ర్యాలీ నిర్వహించిన ఆయన.. కరోనా సంక్షోభంలో ఇలాంటి చట్టాలను కేంద్రం అత్యవసరంగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
వ్యవస్థలో కొన్ని లోపాలున్నాయని... ఆహార కొనుగోళ్ల వ్యవస్థ, ప్రజా సరఫరా వ్యవస్థ(పీడీఎస్)ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అంగీకరించారు రాహుల్. కానీ మోదీ వాటిని సరిచేసే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.
"వ్యవస్థను బలోపేతం చాయాల్సిన అవసరం ఉంది. మరిన్ని మండీలను ఏర్పాటు చేయాలి. కనీస మద్దతు ధర ఇవ్వాలి. రైతులకు మౌలిక వసతులను అందివ్వాలి. కానీ ప్రధాని మోదీ ఇవేవీ చేయట్లేదు. పీడీఎస్, కనీస మద్దతు ధర హామినిచ్చి, మండీలను ఏర్పాటు చేస్తే.. అంబానీ, అదానీ డబ్బులు సంపాదించలేరు."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
ర్యాలీలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. వ్యవసాయ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రైతు సంఘాలను రక్షించేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:- 'కాంగ్రెస్ వస్తే వ్యవసాయ చట్టాలు చెత్తబుట్టలోకి'