ఈనెల బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరగాల్సిన ‘భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సు’ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రసెల్స్ పర్యటన రద్దయినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనావైరస్ కారణంగా విదేశీ ప్రయాణాలు చేయకూడదని అధికారులు సూచించినట్లు తెలిపింది. అనుకూలమైన మరో తేదీన ఈ సదస్సు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు.
భారత్-ఈయూ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే పరస్పర సహకారంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
దిల్లీలో పాఠశాలలకు సెలవులు.
మరోవైపు దిల్లీలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచి ఈనెలాఖరు దాకా సెలవులు ప్రకటించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు.