బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే బలహీన వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ వల్లే చాయ్‌వాలాగా ఉన్న తాను ప్రధాని పదవికి చేరుకున్నానని అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవల్ని శ్లాఘించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలపలేని పార్టీలు ప్రధానమంత్రి పదవిని ఏ విధంగా చేపడతాయని ఎస్పీ-బీఎస్పీ కూటమిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనపై ఆరోపణలు చేసేందుకు ప్రతిపక్ష నేతలు పోటీ పడుతున్నారన్నారు.
"చౌకీదార్‌పై ఆరోపణలు చేసేందుకు పోటీలు జరుగుతున్నాయి. నాపై ఆరోపణలు చేసేందుకు ప్రతిపక్ష నేతలు ఉత్సాహపడుతున్నారు. మహాకూటమి కళాకారులు చౌకీదార్‌పై విరుచుకుపడుతున్నారు. భాజపా, మోదీపై ప్రజలెందుకు విశ్వాసముంచుతున్నారో అందరికీ తెలుసు. గత ఐదేళ్ల అభివృద్ధి చరిత్ర....వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధిపై ఆకాంక్షే ప్రజల విశ్వాసానికి కారణం. మోదీ లక్ష్యమేమిటంటే ఉగ్రవాదుల్ని నిర్మూలించడం, అవినీతిని అంతమొందిచడం, వ్యాధుల నిర్మూలన, పేదరికాన్ని రూపూమాపడం... ఇదే లక్ష్యంతో నేను ముందుకు సాగుతున్నా. దీనికి మీ ఆశీర్వాదం కావాలి" - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి