అయోధ్య భూ వివాదం కేసుపై సుప్రీంకోర్టు మహోన్నత తీర్పు చెప్పిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తీర్పును దేశమంతా స్వాగతించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైందన్నారు. తీర్పుపై జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని.
అయోధ్య కేసులో అన్నివర్గాల వాదనలను సుప్రీంకోర్టు ఎంతో ధైర్యంగా ఆలకించిందని మోదీ అన్నారు. అందర్నీ ఒప్పించడం అంత సులువు కాదని..రెండు వైరుధ్యాలు కలగలిసిన తరుణమిదన్నారు.
"సుప్రీంకోర్టు అన్ని వర్గాల వాదనలను........ ఎంతో ధైర్యంగా ఆలకించింది. సుప్రీం తీర్పు అందరికీ సమ్మతంగా రావడం సంతోషకరం. న్యాయాలయాలు, న్యాయమూర్తులు అభినందనలకు పూర్తిగా అర్హులు. నవంబరు 9నే బెర్లిన్ గోడ కూలింది. ఈ నవంబర్9నే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభమైంది. అయోధ్య తీర్పుతో కలిసి ఈ నవంబర్9 మనల్ని కలిసికట్టుగా నడవమని సందేశమిస్తోంది. నవభారతంలో భయం, విభేదాలు, నకారాత్మక భావనలకు ఎలాంటి స్థానం లేదు. రాజ్యాంగ పరిధిలో క్లిష్టమైన సమస్యలనూ పరిష్కరించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం సందేశమిచ్చింది. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం. నవభారతాన్ని నిర్మిద్దాం. అందర్నీ కలుపుకుంటూ, అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ.. అందరిలో విశ్వాసాన్ని నింపుతూ ముందుకుసాగాల్సిన అవసరం ఉంది. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు దేశంలోని ప్రతిపౌరునిపై దేశ నిర్మాణంపై బాధ్యత మరింత పెరిగింది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పు: 'పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయబోం'